అసెంబ్లీలో జరిగిన పరిణాలను తలచుకుని చంద్రబాబు బోరున విలపించారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో.. వివరించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ ఒక్కసారిగా తనను తాను కంట్రోల్ చేసుకోలేక చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగడంపై భోరున విలపించారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. తన భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరుష వ్యాఖ్యలు చేయడం దారుణమని వాపోయారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ కుటుంబంపై ఇంత దారుణంగా విమర్శలు చేయడంతో సహించలేకపోతున్నానని చంద్రబాబు విలపించారు.
ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని తప్పుబట్టారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదని, ప్రతి సంక్షోభంలోనూ తనకు ఆమె అండగా నిలిచారని తెలిపారు. భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు పాల్పడుతున్నారని వాపోయారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదని గుర్తుచేశారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచానికి దిగజారి పోయాయని చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారిందని చెప్పారు.
అప్పుడు తన తల్లిని… ఇప్పుడు తన భార్యను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని, దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానని తెలిపారు. తప్పు జరిగింది.. క్షమించమని అడిగారని గుర్తుచేశారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, అయినా ప్రజల కోసం భరిస్తున్నానని తెలిపారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని చంద్రబాబు సూచించారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదన్నారు. కానీ గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా వేధిస్తోందని విమర్శించారు. కేసుల పేరుతో బెదిరిస్తోందని, బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు వెళితే చివరకు తన భార్యను కూడా ఇలాంటి ఈ డర్టీ పాలిటిక్సలోకి లాగారని వాపోయారు. రాజకీయాల్లో తనను ప్రోత్సహించడం తప్పనిస్తే ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదని చంద్రబాబు వివరించారు.
అంతకుముందు టీడీఎల్పీ సమావేశలో కూడా చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. ఓ దశలో చంద్రబాబు కంటతడి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు ఆయనను సముదాయించినట్లు సమాచారం. సమావేశం అనంతరం సభకు వచ్చిన చంద్రబాబు.. మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసి.. సభ్యులందరికీ నమస్కరిస్తూ హాల్ నుంచి బయటికి వెళ్లిపోయారు.