సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా…చంద్రబాబు షాకింగ్ నిర్ణయం

Chandrababu

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, రెండో రోజు సభ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వ్య‌క్తిగ‌త విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మ‌ళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ సభలోకి అడుగుడతానంటూ చంద్రబాబు స‌భ‌నుంచి తీవ్ర భావోద్వేగంతో వెళ్లిపోయారు.

గత రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని, కానీ, ఈ రోజు త‌న‌పై, త‌న కుటుంబంపై కూడా వైసీపీ సభ్యులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేశారని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భార్య, తన కుటుంబంపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం బాధించింని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను అవమానించి, తన కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగారని ఉద్వేగానికి లోనయ్యారు.

అయితే, చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మైక్‌ కట్‌ చేయడంతో చంద్రబాబు మరింత ఆవేదనకు లోనయ్యారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. చంద్రబాబుతోపాటు టీడీపీ సభ్యులు కూడా వెళ్లారు. ఈ సందర్భంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులు అవహేళనగా నవ్వుతూ ఉన్నారు.

మరోవైపు, బ‌య‌ట‌కు వ‌చ్చిన తర్వాత చంద్ర‌బాబు త‌న ఛాంబ‌ర్లో అత్య‌వ‌స‌రంగా టీడీఎల్పీ స‌మావేశం నిర్వ‌హించారు. టీడీపీ సభ్యులు, ఎమ్మెల్సీలు లోకేష్‌, య‌న‌మ‌ల స‌హా ఇత‌ర ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. స‌భ‌లో వైసీపీ స‌భ్యుల తీరు, విమర్శలు వ్యవహారంపై వారంతా చ‌ర్చించారు. వైసీపీ స‌భ్యులు శృతిమించి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అందరూ అభిప్రాయ‌ప‌డ్డారు. కుటుంబం, మ‌హిళ‌ల వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా వైసీపీ స‌భ్యులు కామెంట్లు చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మరి కాసేపట్లో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.