టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం అంటే.. మడమ తిప్పడమే’ అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల తర్వాత పెట్టే అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్కరోజే నిర్వహించటం.. చట్టసభల్ని అభాసుపాలు చేయటమేనని ధ్వజమెత్తారు. 15 రోజుల పాటైనా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన టీడీపీ శాసన సభా పక్షం సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అయితే.. ఒక్కరోజు సమావేశాన్ని బహిష్కరించాలని అధిక శాతం నేతలు చంద్రబాబుకు సూచించారు.
15 రోజులకు పట్టుబడదాం
అంతేకాదు.. సభలకు ముందు జరిగే.. బీఏసీ సమావేశంలో 15 రోజలపాటు సమావేశాల నిర్వహణకు పట్టుబడదామని, ప్రభుత్వం దిగిరాకుంటే అందుకనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటించాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన ఆన్లైన్లో సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం, ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మే 20న కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగిన బడ్జెట్ సమావేశాన్ని గుర్తు చేసిన నేతలు, నవంబర్ 19కి ఆరు నెలలు పూర్తవుతున్నందున అసెంబ్లీ నిర్వహించటం ప్రభుత్వానికి అనివార్యమైందని తప్పుబట్టింది.
ఇది మడమ తిప్పడమే!
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ప్రతిపక్షానికి భయపడి సమావేశాలను ఒక్క రోజుకే పరిమితం చేయటం మడమ తిప్పడానికి నిదర్శనమని నేతలు విమర్శించారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించకుండా మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తానని ప్రకటించి.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు వంటి హామీలను గాలికొదిలేసి.. నిరసన గళం వినిపిస్తున్న ఉద్యోగులపై ఏసీబీని ఉసిగొల్పుతూ. వ్యవహరిస్తున్న తీరు దారుణమని నేతలు సమావేశంలో ఆక్షేపించారు.
సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత
రాష్ట్రంలో మాదకద్రవ్యాల దందా, నిత్యావసరాల ధరల పెంపు, ప్రజలపై పన్నుల భారం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్య, కేంద్ర ప్రాయోజిక పథకాల నిధుల మళ్లింపు, మత్స్యకారుల సమస్యలు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య, అమరావతి ఉద్యమం, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాల్సిందేనని టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో దొంగఓట్లతో అరాచకాలు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని మండిపడ్డారు. ఎయిడెడ్ ఆస్తులు, రాజధాని పరిరక్షణ, గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కుతున్న విద్యార్థులు, రైతులపై పోలీసుల లాఠీఛార్జీలు దుర్మార్గమని ధ్వజమెత్తారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు వస్తున్న ప్రజామద్దతు ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజావ్యతిరేకతను బయటపెడుతోందని నాయకులు అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీకి వెళ్దామా? వద్దా?
ఈ నెల 18న జరగనున్న ఒక్కరోజు శాసనసభాపక్ష సమావేశాలకు హాజరు కావాలా ? వద్దా ? అనే అంశంపై చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందుకోసం ఆన్ లైన్లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. అసెంబ్లీ తీరుతెన్నులపై చర్చించారు. ఈ సమావేశంలో నేతలు తమ అభిప్రాయాలను అధినేత చంద్రబాబుకు తెలిపారు. మెజారిటీ నాయకులు.. బాయ్‌కాట్ చేసి.. ఆ రోజు మాక్ అసెంబ్లీ నిర్వహించి.. ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడదామన్నారు. మరికొందరు.. నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరై.. నిరసన తెలుపుదామని చెప్పారు. మొత్తంగా.. దీనిపై చంద్రబాబుదే తుది నిర్ణయమని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates