ఏపీ సీఎం జగన్.. ఒక విషయంపై ఇమ్మిడియెట్గా రియాక్ట్ అయ్యారు. తాను ప్రయాణిస్తున్న మార్గంలో దుర్వాసన రావడం.. గమనించిన ఆయన.. దీనిపై అధికారులను నిలదీశారు. వెన్వెంటనే వారిని రంగంలోకి దింపి.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీసి.. సమస్య పరిష్కారానికి కృషి చేశారు. విషయం ఏంటంటే..
జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంపై.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని గన్నవరం విమానాశ్రయం నుంచి వస్తుండగా.. విజయవాడలోని ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయమై వెంటనే సీఎం తన కార్యాలయం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవో నుంచి సచివాలయం అధికారులకు.. అక్కడి నుంచి కృష్ణా జిల్లా కలెక్టరుకు ఆదేశాలు చేరాయి.
ఇంకేముంది.. హుటాహుటిన రంగంలోకి దిగి.. అసలు సమస్యను గుర్తించారు. ఆటోనగర్ నుంచి వచ్చే మురుగు ప్రసాదంపాడు, ఎనికేపాడులో నిల్వ ఉంటోందని గమనించిన అధికారులు.. పక్కా డ్రైనేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. జాతీయ రహదారి వైపు ఆ దుర్వాసన రాకుండా ఆటోనగర్ నుంచి నిడమానూరు మీదుగా మురుగునీటిని మళ్లించాలని తెలిపారు. ఆటోనగర్ వద్ద పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీటిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అదేవిధంగా జాతీయరహదారి వెంట వీధిదీపాలు వెలగకపోవడంపైనా సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రులు విమానాశ్రయం నుంచి నగరం మీదుగా సచివాలయం, ఇతర ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉన్నందున.. వీధి దీపాలు, మురుగు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. దీంతో ఇతర పనులు మానేసి మరీ.. అధికారులు.. ఇక్కడ పనులు ప్రారంభించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates