తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి జోరుతో రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటున్న పార్టీ.. మరింత బలోపేతం అయేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదులుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలవకముందు ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారని సమాచారం. ఈటల లాంటి నాయకుడు పార్టీలోకి వస్తే ఓ ఎమ్మెల్యే సీట దక్కడంతో పాటు ప్రజల్లో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భట్టి కారణమా?
ఈ ఏడాది జూన్‌లో ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గం నుంచి ఆయన్ని బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ను వీడాలని ప్రయత్నించిన ఈటల ముందు కాంగ్రెస్ నేతలనే కలిశారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కొంతమంది ఇతర కాంగ్రెస్ నాయకులతోనూ ఈటల సమావేశమవడంతో ఆయన ఈ పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం సాగింది. కానీ కాంగ్రెస్ నేతలు అందకు సుముఖంగా లేకపోవడం.. కాంగ్రెస్ నేతలతో ఈటల భేటీ విషయం తెలుసుకున్న బీజేపీ రంగంలోకి దిగి ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం చకచకా అయిపోయాయి. ఈటలను పార్టీలోకి చేర్చుకుందామంటే భట్టీనే వద్దన్నారని తాజాగా తెలిసింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దారుణ ఫలితంపై సమీక్షలో భాగంగా రాష్ట్ర నాయకులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. అప్పుడు ఈటలను చేర్చుకుందామంటే కొంతమంది నాయకులు వద్దన్నారని భట్టీ చెప్పబోతుండగా మధ్యలో కలగజేసుకున్న వేణుగోపాల్ భట్టీపై ఫుల్ ఫైర్ అయ్యారని సమాచారం. మీరే ఈటలను చేర్చుకోవద్దని గతంలో నాతో చెప్పారు.. ఇప్పుడు మళ్లీ ఇతరులపై నిందలు వేస్తున్నారని భట్టీపై వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
ఈటల చేరి ఉంటే..
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల కాంగ్రెస్‌లో చేరి ఉంటే ఇప్పుడా పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడేది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం రేవంత్ కష్టపడుతున్నా పార్టీలో సీనియర్ల మధ్య అంతర్గత విభేదాలు మాత్రం ఆగట్లేదు. మరోవైపు ఈటల కాంగ్రెస్‌లో చేరినా హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలిచేవారు. ఎందుకంటే పార్టీని చూసి కాకుండా వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ను చూసి ప్రజలు గెలిపించారనే విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ మరింత బలపడేది. ఇప్పుడేమో ఆ అవకాశం బీజేపీకి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ బలపడితే కాంగ్రెస్‌పై దెబ్బ పడుతుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates