ఆమెతో విభేదాలు.. ఆయ‌న‌కు నో ఎమ్మెల్సీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్‌.. సొంత పార్టీకే చెందిన కీల‌క నేత‌కు మాత్రం విస్మ‌రించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సీఎంకు విధేయుడిగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఎమ్మెల్సీ ఆశ మాత్రం తీర‌లేద‌ని చెప్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఓ మహిళా ఎమ్మెల్యే అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇంత‌కీ ఆ నేత ఎవ‌రంటే.. మ‌ర్రి రాజశేఖ‌ర్‌. గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియ‌ర్ నేత‌కు ఈ సారి క‌చ్చితంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో ఆయ‌న పేరు లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

హామీ ఇచ్చినా..
ప్ర‌స్తుతం ఏపీలో ఎమ్మెల్యే, స్థానిక సంస్థ‌ల కోటా క‌లిపి మొత్తం 14 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకే ఈ స్థానాల‌న్నీ ద‌క్క‌డం ఖాయ‌మే. ఇప్ప‌టికే ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థుల పేర్ల‌ను పార్టీ ప్ర‌క‌టించింది. అయితే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మాత్రం అన్యాయం జ‌రిగింద‌నే వాద‌న వినిపిస్తోంది.  గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజ‌శేఖ‌ర్ జ‌గ‌న్ కోరిక మేరకు దాన్ని త్యాగం చేశారు. అప్పుడే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ బ‌హిరంగంగానే హామీనిచ్చారు. దీంతో ఎమ్మెల్సీగా తీసుకుని ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అనుకున్నారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక మూడు సార్లు ఎమ్మెల్సీ ప‌ద‌వుల భ‌ర్తీ జ‌రిగినా ఆయ‌న‌కు మొండిచెయ్యే ఎదురైంది. తాజాగా మ‌రోసారి నిరాశే మిగిలింది.

ఆమెతో విభేదాలు..
చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద ర‌జ‌నీతో విభేదాలో రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రాకుండా అడ్డుప‌డ్డాయ‌నే ప్ర‌చారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం వీళ్లిద్ద‌రూ క‌లిసే ప‌ని చేశారు. కానీ ఆ త‌ర్వాత వీళ్ల మ‌ధ్య వైరం మొద‌లైంద‌ని చెబుతున్నారు. ఆమె గెలుపు కోసం రాజ‌శేఖ‌ర్ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశార‌ని కానీ కృత‌జ్ణ‌త భావం లేని ర‌జ‌నీ రాజ‌శేఖ‌ర్‌ను టార్గెట్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రాకుండా ర‌జ‌నీ అడ్డుకున్నార‌ని రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం బ‌హిరంగంగానే ఆరోపిస్తోంది. అంతే కాకుండా పార్టీలోని ఓ ప్ర‌ముఖుడి అండ‌దండ‌ల‌తో ర‌జ‌నీ రెచ్చిపోతున్నార‌ని రాజశేఖ‌ర్‌కు ప‌ద‌వులు రాకుండా చూస్తున్నార‌ని ఆయ‌న వ‌ర్గం తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోంది.