వివేకా హ‌త్య‌కు 40 కోట్ల సుపారీ.. బాంబు పేల్చిన ద‌స్త‌గిరి!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య వెనుక ఉన్న వాస్త‌వాలు.. బ‌య‌టకు వ‌చ్చాయి. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వివేకా హ‌త్య జ‌రిగిన విష యం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. హ‌త్య జ‌రిగిన త‌ర్వాత‌.. ఇన్నేళ్ల‌కు.. దీని వెనుక ఏం జ‌రిగింద‌నే విష‌యం.. తాజాగా వెలుగు చూసింది. వివేకాది.. రాజ‌కీయ హ‌త్యేన‌ని స్ప‌ష్ట‌మైం ది. అంతేకాదు.. ఈ హ‌త్య వెనుక‌.. రూ.40 కోట్ల వ‌ర‌కు ఒప్పందం ఉంద‌ని.. స్ప‌ష్ట‌మైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వివేకా కారు డ్రైవ‌ర్‌.. ద‌స్త‌గిరి.. అప్రూవ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.

అడ్వాన్స్‌గా కోటి

ఈ క్ర‌మంలో ఆయ‌న సీబీఐ అధికారులకు నిజాలు వెల్ల‌డించార‌ని.. తెలిసింది. దీని ప్ర‌కారం.. తాజాగా వెలుగు చూసిన అంశాల్లో .. మొత్తం 40 కోట్ల ఒప్పందానికి.. వివేకా హ‌త్య జ‌రిగింద‌ని.. త‌న‌కు 5 కోట్ల వ‌రు ఇస్తామ‌ని.. చెప్పార‌ని.. దీనిలో కోటి రూపాయ‌ల వ‌రకు అందాయ‌ని కూడా ద‌స్త‌గిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలను సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానన్నారు. ఇక‌, ఈ హ‌త్య ఎలా జ‌రిగిందో కూడా ద‌స్త‌గిరి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

అస‌లేం జ‌రిగింది?

వివేకా హ‌త్య వెనుక అస‌లు ఏం జ‌రిగింద‌నేది నిన్న మొన్న‌టి వ‌ర‌కు మిస్ట‌రీగా ఉంది. అయితే.. ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారిన త‌ర్వాత‌.. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఎర్ర గంగిరెడ్డి వివేకాపై ఆగ్ర‌హం పెంచుకున్నాడు. ఇక‌, వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. వివేకాకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, ఓడించేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నేది వివేకా ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

అదే ప‌గ‌!

దీంతో ఈ రెండు విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని.. మీ సంగతి తేలుస్తా అంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు ద‌స్త‌గిరి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని, తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ ఇప్ప‌టి ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు ద‌స్త‌గిరి బాంబు పేల్చాడు. ఈ క్ర‌మంలోనే వివేకాను అంతం చేసేందుకు ప్లాన్ జ‌రిగిన‌ట్టు చెప్పాడు. కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి చెప్పాడు.

హ‌త్య ఇలా చేశారు!

వివేకా హ‌త్య ఎలా జ‌రిగిందో కూడా ద‌స్త‌గిరి వెల్ల‌డించాడు. ఆ రోజురాత్రి సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. ఆయ‌న పెంపుడు కుక్కను కారుతో తొక్కించి చంపేశారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి నేను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లా. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి చేరుకున్నా. మ‌మ్మ‌ల్ని చూసిన వివేకా ఈ సమయంలో ఎందుకు వచ్చారని నిర్ఘాంతపోయారు. తర్వాత వివేకా బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడు అని ద‌స్త‌గిరి చెప్పాడు.

ఆ త‌ర్వాత‌.. వివేకా బెడ్‌రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడిచేసినట్టు ద‌స్త‌గిరి పేర్కొన్నాడు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడిచేశాడని వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడించారు. మొత్తానికి వివేకా కేసు.. తీవ్ర‌సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో ద‌స్త‌గిరి చెప్పిన వాస్త‌వాలు.. మున్ముందు.. ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయో చూడాలి.