ఏపీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారు ఇదే మాట చెబుతున్నారు. ఇక, అధికార పార్టీలోనూ ఇదే గుసగుస వినిపిస్తోంది. “చంద్రబాబు చెప్పిందే ఫైనలా?” అంటూ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో తలెత్తిన వివాదం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం జీవో 42, జీవో 50లను తీసుకువచ్చింది. తద్వారా ఆయా విద్యాసంస్థలు.. ప్రైవేటు పరం అవుతాయని.. దీంతో పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతారని.. టీడీపీ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన ఆందోళన పరాకాష్టకు చేరింది. విద్యార్థులపై లాఠీ చార్జీతో ప్రభుత్వంపై మరింత సెగ పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ అంశంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎయిడెడ్‌పై ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. దేశంలో ఎక్కడా ఎయిడెడ్ సంస్థలను విలీనం చేసుకున్న ప్రభుత్వం లేదని.. ఆయన చెప్పారు.
ఇక, రాబోయే రోజుల్లో టీడీపీ ఎయిడెడ్ విద్యార్థులకు అండగా ఉంటుందని.. వారి ఉద్యమానికి మద్దతిస్తున్నది తెలిపారు. ఈ అంశం.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది. పైగా విద్యావ్యవస్థతో కూడుకున్న సున్నిత విషయం కావడంతో ప్రజలు కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు. ఇక, ప్రభుత్వ వెర్షన్ చూసుకుంటే.. తామేమీ బలవంతం చేయడం లేదని.. విలీనం ప్రతిపాదన.. కేవలం అంగీకరించిన సంస్థలకే వర్తించనుందని.. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని.. చెబుతున్నారు.
అయితే.. ప్రభుత్వ వాదన కంటే కూడా ప్రతిపక్షం వాదన బలంగా ప్రజల్లోకి వెళ్తోందని.. ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని వివరణలు ఇచ్చినా.. మంత్రులు కూడా ఈ విషయంపై స్పందించినా.. ప్రజల్లోకి మాత్రం ప్రతిపక్షవాదనే బలంగా చేరింది. దీంతో చంద్రబాబు చెప్పినట్టే జరుగుతుందా? ప్రభుత్వం వెనక్కి తగ్గాలా? అనే సందేహాలు.. మంత్రుల్లోనే వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం జోక్యం చేసుకుని.. ఇప్పటికైనా మీడియా ముందుకు రావాలని.. ఎయిడెడ్‌పై వివరించాలని వారు కోరుతుండడం గమనార్హం.