కుప్పంలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై హైకోర్టు మండిపడింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధులు ముందస్తుగా తమ నుండి అనుమతి తీసుకోవాలని పలమనేరు డీఎస్పీ నోటీసులివ్వటం బాగా వివాదాస్పదమైంది. దారినపోయే చెత్తను నెత్తినేసుకున్నట్లుంది పోలీసుల వ్యవహారం. అవసరం లేనిచోట బాగా ఓవర్ యాక్షన్ చేసి చివరకు హైకోర్టు దగ్గర అంక్షితలు వేయించుకుంటే కానీ పోలీసులకు తృప్తి తీరలేదేమో.
నిజానికి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పోలీసులకు అసలు సంబంధమే లేదు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులు ప్రచారం చేసుకోవటం అన్నది వారి హక్కు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అభ్యర్థులు లేదా వాళ్ళ మద్దతుదారులు ప్రచారం చేసుకోకుండా ఎలాగుంటారు ? ఇంత చిన్న లాజిక్ మిస్సయిన పోలీసులు అనవసరంగా కలగజేసుకున్నారు. ప్రచారానికి తమ అనుమతి తీసుకోవాలని కుప్పంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్న పలమనేరు డీఎస్పీ టీడీపీ అభ్యర్ధులు+నేతలకు నోటీసులివ్వటం వివాదాస్పదమైంది.
పోలీసుల నోటీసులపై వెంటనే టీడీపీ కోర్టుకెక్కింది. దాంతో కేసును విచారించిన హైకోర్టు పోలీసులను ఫుల్లుగా వాయించేసింది. ఇపుడు ప్రచారానికి అనుమతి తీసుకోవాలని చెప్పిన పోలీసులు రేపు నామినేషన్లు వేయటానికి కూడా తమ అనుమతి తీసుకోవాలని చెబుతారేమో అన్న కోర్టు ప్రశ్న నూరుశాతం కరెక్టే అనడంలో సందేహం లేదు. ప్రచారానికి పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని డీఎస్పీకి తెలీదా ? తెలిసీ నోటీసులు ఎలా ఇచ్చారు ?
ఇచ్చే నోటీసులేదో వైసీపీ అభ్యర్థులు, నేతలకు కూడా ఇచ్చుంటే అది వేరే విధంగా ఉండేది. కానీ కేవలం టీడీపీకి మాత్రమే ఇవ్వటంతో వివాదాస్పదమైంది. తెరవెనుక వైసీపీ నేతల ఆదేశాల ప్రకారమే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి
విచిత్రమేమంటే అప్పట్లో టీడీపీ అయినా ఇపుడు వైసీపీ అయినా బాగానే ఉన్నాయి. మధ్యలో కోర్టులో తలొంచుకున్నది పోలీసులే. తెరమీద ఎప్పుడు కూడా పోలీసుల ఓవర్ యాక్షనే ఎక్స్ పోజ్ అవుతోంది. ఈ విషయంలో రాజకీయపార్టీలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. పోలీసుల ఓవర్ యాక్షన్ను కంట్రోల్ చేయకపోతే చివరకు పార్టీలే పోలీసుల దెబ్బకు బలైపోతారు. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా పోలీసు వ్యవస్ధ జోలికి పోకుండా ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో దుష్ఫలితాలను సమాజమే అనుభవించాల్సుంటుంది.