డైవ‌ర్ట్ చేయ‌డంలో కేసీఆర్ స‌క్సెస్‌

కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం స్వ‌యంగా ముఖ్య‌మంత్రే అన్ని ర‌కాలు వ్య‌హాలు సిద్ధం చేసి.. పార్టీని గెలిపించే బాధ్య‌త త‌న మేన‌ళ్లుడు హ‌రీష్ రావుపై పెట్టారు. కానీ ప్ర‌జ‌లు మాత్రం ఈట‌ల రాజేంద‌ర్‌కే జై కొట్టారు. దీంతో పార్టీ మొత్తం దృష్టి పెట్టినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెల‌వ‌లేద‌ని.. ఇది ఆ పార్టీపై వ్య‌తిరేక‌త‌ను చాటుతుంద‌ని ప్ర‌జ‌లు మాట్లాడుకోవడం మొద‌లెట్టారు. కానీ ఇప్పుడా సంగ‌తి మ‌ర్చిపోయి ఎక్క‌డ చూసినా వ‌రి కోనుగోల్ల గురించే చ‌ర్చ వినిపిస్తోంది.

కేంద్రం వ‌రి కొన‌న‌ట్టోంద‌ని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ధ‌ర్నాలు చేయాల‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించింది. దీంతో హుజూరాబాద్ ఓట‌మి విష‌యం తెర‌మ‌రుగైంది. ఆ ప‌రాజ‌యం తాలూకు ప్ర‌భావాన్ని ప్ర‌జ‌ల్లో ఎక్కువ కాలం ఉండ‌కుండా చేయ‌డానికి కేసీఆర్.. ఈ వ‌రి కోనుగోలు విష‌యాన్ని హైలైట్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విష‌యాన్ని డైవ‌ర్ట్ చేయ‌డంలో కేసీఆర్ విజ‌య‌వంత‌మ‌య్యార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

త‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి త‌న‌కే ఎదురు తిరిగిన ఈట‌ల రాజేంద‌ర్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేకుండా చేయ‌డం కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయ‌త్నించార‌ని టాక్‌. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముందు నుంచే అక్క‌డ విజ‌యం కోసం అన్ని ర‌కాలు ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేశారు. ఇత‌ర పార్టీల నుంచి కీల‌క నేత‌ల‌ను చేర్చుకోవ‌డంతో పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అక్క‌డే తొలిసారి ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. కానీ ఎన్ని చేసినా టీఆర్ఎస్‌కు ఓట‌మి మాత్రం త‌ప్ప‌లేదు. రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించిన ఈ ఉప ఎన్నిక‌లో ప‌రాజ‌యం ఆ పార్టీ ప్ర‌భ‌ను దెబ్బ‌తీస్తుంద‌ని వ‌చ్చే ఎన్నిక‌లపై ఇది ప్ర‌భావం చూపిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లు దీని గురించే ఎక్కువ‌గా మాట్లాడుకున్నారు. కానీ ఫ‌లితాల త‌ర్వాత రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్‌.. మ‌రోసారి త‌న మాస్ట‌ర్‌మైండ్‌తో విలేక‌ర్ల ముందుకు వ‌చ్చారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న వరి కోనుగోళ్ల విష‌యాన్ని తెర‌మీద‌కు తెచ్చి ఆ త‌ప్పునంతా కేంద్రంపై తోసేశారు. అంతే కాకుండా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడి బండి సంజ‌య్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక విష‌యం మ‌రుగున ప‌డిపోయింది. వ‌రి కోనుగోళ్ల‌పై టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ యుద్ధం మొద‌లైంది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు సంజ‌య్ గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌గా.. వ‌రుస‌గా రెండో రోజూ ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ మ‌రింత రెచ్చిపోయారు. అప్ప‌టి నుంచి రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తూనే ఉంది. వ‌రి కోనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ ధ‌ర్నాలకు సిద్ధ‌మ‌వ‌గా.. బీజేపీ కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణ‌మంటూ రోడ్డెక్కింది.