టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనూహ్యంగా పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈటల రాజేందర్ గెలవకూడదని కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. తమ వాడిగా ఈటల రాజేందర్‌ను గుండెల్లో పెట్టుకుని ఓట్లతో ఆశీర్వదించారు. ఎన్నికల్లో గెలవడం.. ఓడడం సాధారణమేనని కేసీఆర్ బయటకు చెప్తున్నప్పటికీ ఈ ఓటమికి దారితీసిన పరిణామాలపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం షెడ్యూల్ రాకముందే అక్కడి ఇతర పార్టీల నాయకులను కేసీఆర్ తన పార్టలో చేర్చుకున్నారు. అందులో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 60వేలకు పైగా ఓట్లు సాధించి ఈటల తర్వాత రెండో స్థానంలో నిలిచారు. దీంతో అతణ్ని టీఆర్ఎస్లోకి లాగేసుకుంటే తమ విజయం ఖాయమేనని కేసీఆర్ భావించారు. కానీ ఆ వ్యూహమే నష్టం చేసిందని విశ్లేషకులు అంటున్నారు. కోరి తెచ్చుకున్న కౌశిక్ రెడ్డే కేసీఆర్ కొంప ముంచారని అంటున్నారు.
చివరి వరకూ కౌశిక్‌ను కాంగ్రెస్‌లోనే ఉంచి.. ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకుని ఉప ఎన్నికలో నిలబెట్టాలని కేసీఆర్ మొదట అనుకున్నట్లు సమాచారం. కానీ కౌశిక్ కాల్ లీక్‌తో బండారం బయటపడడంతో కాంగ్రెస్ ఆయనపై వేటు వేసింది. దీంతో ముందుగానే కౌశిక్ టీఆర్ఎస్లో చేరారు. ఆ కాల్ లీక్ వ్యవహారంతో ఆయనకు సీటు దక్కలేదు. టీఆర్ఎస్ వేరే అభ్యర్థికి ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లో పడింది.
అదే కౌశిక్ రెడ్డిపై కేసీఆర్ దృష్టి పెట్టకుంటే ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే.. కౌశిక్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరపున పోటీ చేసేవారు. ఎలాగో తనకున్న ఓటు బ్యాంకు ప్రకారం మెరుగ్గానే ఓట్లు పడేవి. మరోవైపు టీఆర్ఎస్ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పడేవి. దీంతో బీజేపీ తరపున బరిలో దిగిన ఈటల రాజేందర్‌కు వచ్చే ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలా చూసుకుంటే టీఆర్ఎస్ కచ్చితంగా గెలిచేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ కౌశిక్‌ను అనవసరంగా పార్టీలోకి తెచ్చిన కేసీఆర్ చర్యల వల్ల టీఆర్ఎస్కు ఓటమి తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గవర్నర్ కోటాలో కౌశిక్‌ను ఎమ్మెల్సీ చేద్దామంటే ఆ ప్రతిపాదన గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. దీంతో ఈ నెలలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనైనా కౌశిక్‌కు ఆ పదవి దక్కుతుందేమో చూడాలి.