గడిచిన రెండు రోజులుగా వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఎంతలా విరుచుకుపడుతున్నారో తెలిసిందే. బండి సంజయ్ తో పాటు.. కేంద్రం మీదా ఆయన మాటల తూటాల్ని విసురుతున్నారు. అన్నింటికి మించి సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో.. ‘ఫాంహౌస్ కు వస్తే ఆరుముక్కలవుతావు నా కొడకా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఉద్దేశించి అంత మాటను సింఫుల్ గా అనేయటమే కాదు.. వార్నింగ్ మీద వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ సాఫ్ట్ అయ్యారనుకుంటున్నారా? లోపల ఒరిజినల్ అలానే ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొందరు కావాలని కేసీఆర్ ను చిన్నబుచ్చుతూ మాట్లాడుతున్నారని.. అలాంటి వారికి షాక్ తప్పదన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వెకిలి మాటలు మాట్లాడేవాళ్లు ఎక్కువైండ్రని..అలా మాట్లాడితే ఊరుకోమన్నారు. ఈ ఏప్రిల్ 27నాటికి పార్టీని ఏర్పాటు చేసి 20 ఏళ్లు అయ్యాయని.. ఒక ప్రాంతీయ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావటం ఎంత కష్టమన్న ఆయన.. ఉద్యమానికి గులాబీ జెండా మోసినప్పుడు అప్పటి ప్రభుత్వం 370 మంది పిల్లల్ని కాల్చి చంపిందన్నారు.
కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా కేసీఆర్ ఉన్నారని.. ఒక్కొక్క అడుగు వేస్తూ అనాడే ఉద్యమానికి స్పూర్తినిచ్చింది నిజామాబాద్ జిల్లా అని చెప్పారు. తెలంగాణ కోసం కోట్లాడే నేత కేసీఆర్ అని.. యాబై.. అరవై ఏండ్లు రాజకీయం చేసిన షబ్బీర్ అలీకి సి్గుమానం ఏమీ లేదన్నారు. రూ.200 పెన్షన్ కు కాంగ్రెస్ వాళ్లు డబ్బాలు కొట్టుకుంటున్నారని.. 42 లక్షల మందికి రూ.10వేల కోట్లను నెలకి పెన్షన్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందన్నారు. తన తాజా వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులపై పరుష వ్యాఖ్యలు చేసేందుకు ఏ మాత్రం తగ్గేది లేదన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారని చెప్పాలి.