ఒక్కోసారి కొన్ని సంఘటనలు రాజకీయ నాయకుల కళ్లు తెరిపిస్తాయి. తమదే పెత్తనం అని భావించే నేతలు కూడా కొన్నిసార్లు కిందికి దిగిరావాల్సి ఉంటుంది. ఊహించని ఓటములు ఎదురైనప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నపుడు అన్నింటినీ పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాల్లి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి దెబ్బకు కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చారని.. ఇక ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని విశ్లేషకులు అనుకుంటున్నారు.
ఈటల రాజేందర్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేసేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసం కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నించారని తెలిసిందే. కానీ ప్రజలు మాత్రం ఈటల పక్షాల నిలబడ్డారు. కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే అని కేసీఆర్ బయటకు చెప్తున్నప్పటికీ ఈ పరాజయం ఆయన్ని బాగానే కలవరపెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వరుసగా రెండు రోజుల పాటు ప్రెస్మీట్లు పెట్టిన ఆయన.. వరి పేరుతో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలా మెత్తగా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో కానీ వడ్లు కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలంతా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు పరిస్థితులు తెలుసుకున్న కేసీఆర్ ముందుగానే ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వరుసగా రెండు సార్లు ప్రభుత్వంలోకి రావడంతో టీఆర్ఎస్పై సహజంగానే ప్రజల్లో బోర్ కొడుతోంది. అయిదే అది వచ్చే ఎన్నికల్లో ఓటమికి దారి తీయకూడదని కేసీఆర్ ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వరి కొనుగోళ్ల తప్పు మొత్తం కేంద్రంపై నెట్టేసి బీజేపీపై పోరుకు సిద్ధమయ్యారు. ఇక మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. వివిధ అభివృద్ధి పనుల సమీక్ష కోసం ఆయన వరంగల్, హనుమ కొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.
ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ తప్ప సీఎం బయటకు రాడని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని తెలిసినప్పుడు ఆయన ఇలా ప్రజల్లోకి రావడం సాధారణంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్‌కు ముందు వివిధ జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కేసీఆర్ పర్యటనలు చేశారు. ఇప్పుడిక హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో మరోసారి పర్యటన చేసేందుకు సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates