తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. రాష్ట్ర బీజేపీ చీఫ్.. బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆదివారం రాత్రి.. కేసీఆర్ చేసిన కామెంట్ల నేపథ్యంలో బండి ఆయనకు కౌంటర్ కామెంట్లు చేశారు. తెలంగాణను నాశనం చేస్తోందే..కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నది.. కేసీఆరేనని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు..కుట్రలు చేస్తున్నారని.. రైతులే కేసీఆర్‌ను రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చేస్తోంది ఒకటి.. బయటకు చెబుతోంది… మరొకటని బండి విరుచుకుపడ్డారు.
కేంద్రం రెండు లక్షల కోట్లు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రెండు లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని బండి సంజయ్ఆధారాలతో సహా చూపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “రైతులకు కేసీఆర్ రుణమాఫీ ఇంత వరకు అమలు చేయలేదు. పెట్రోల్, డీజిల్‌పై 2015లోనే 4 శాతం వ్యాట్ పెంచారు. నోరు తెరిస్తే.. కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారు. కేంద్రం తెలంగాణకు 2,50,908 కోట్లు ఇచ్చింది అయినప్పటికీ..కేవలం 40 వేల కోట్టే వచ్చాయని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పెట్రోల్‌పై వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి” అని బండి నిప్పులు చెరిగారు.
కేంద్రం అలా చెప్పిందా?
యువత ఉపాధి పనుల కోసం.. గ్రామాలకు వస్తోందని.. దీనిని బట్టి కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్ధమవుతుందని అన్నారు. అంతేకాదు.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని.. కొత్త చట్టంలో కేంద్రం చెప్పిందా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పెట్రోల్ ధరలు తగ్గిస్తారని కేసీఆర్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారని.. కానీ, కేసీఆర్ ఒక్క ప్రకటన కూడా చేయలేదని బండి దుయ్యబట్టారు. “రైతులను కేసీఆర్ ప్రభుత్వమే ఆగం చేసింది. వరి వేయొద్దని ఒకసారి, పత్తి కొనద్దని ఒకసారి రైతులను ఆదేశిస్తోంది. అంతేకాదు, బండి సంజయ్ ప్రెస్‌మీట్ పెడితే.. తిట్టించాలని.. కేసీఆర్ చూస్తున్నాడు” అని విమర్శించారు.
కేసీఆర్.. కుంభకోణం..
రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి వేశారనడం వెనుక కుంభకోణం ఉందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాయిల్డ్ రైస్‌తో రైతులకు సంబంధం లేదన్నారు. కేసీఆర్ కేబినెట్లో అబద్ధాల శాఖ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని కేంద్రం అంటే ఎందుకు కేసీఆర్ అడ్డుకున్నారని నిలదీశారు. “జాతీయ రహదారులకు 40 వేల కోట్లు ఇవ్వలేదా.. ఈ విషయం కేసీఆర్ చెప్పాలి. సాగు చట్టాలపై కేసీఆర్ ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే..రైతులే రాళ్లతో కొడతారు. కొంత మందితో కుమ్మక్కయి.. కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు” అని.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా లేరని, కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి.. యుద్ధం చేస్తానని అంటున్నారని, ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని బండి ప్రశ్నించారు.