వివాదాన్ని రాజేసిన అఖిలేష్‌!

దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎప్పుడూ రాజ‌కీయ వేడి ర‌గులుతూనే ఉంటుంది. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌స‌భ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తే.. కేంద్రంలో కుర్చీ ద‌క్కించుకోవ‌డం సులువ‌వుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఆ రాష్ట్రంపైనే దృష్టి సారిస్తాయి. వ‌చ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిపై జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టాయి. అక్క‌డ అధికారాన్ని కాపాడుకోవ‌డం కోసం బీజేపీ.. తిరిగి గ‌ద్దెనెక్క‌డం కోసం కాంగ్రెస్‌, ఎస్పీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మ‌రికొన్ని నెల‌ల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎస్పీ అధినేత ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.

పాకిస్థాన్ జాతిపిత మ‌హ‌మ్మ‌ద్ అలీ జిన్నాను ప్ర‌శంసించిన అఖిలేష్ యాద‌వ్‌.. తాజాగా త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. జిన్నాను గాంధీతో పోల్చిన ఆయ‌న‌.. త‌న వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శిస్తున్న‌వాళ్లు చ‌రిత్ర పుస్త‌కాల‌ను మ‌రోసారి తిర‌గేయాల‌ని సూచించారు. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ, జిన్నా, మ‌హాత్మా గాంధీ దేశానికి స్వాత్రంత్య్రం కోసం పోరాడార‌ని, వాళ్లంద‌రూ ఒకే విశ్వ‌విద్యాల‌యం నుంచి న్యాయ‌వాద ప‌ట్టా పొందార‌ని ఇటీవ‌ల అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్యాల‌పై తీవ్ర దుమారం రేగింది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో పాటు ప‌లువురు బీజేపీ నాయ‌కులు అఖిలేష్‌పై తీవ్ర స్థాయిలో మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. జిన్నాపై అఖిలేష్‌కు ఇంకా ప్రేమ చావలేద‌ని.. ఇంత‌కీ భార‌త్ లేదా పాకిస్థాన్ చ‌రిత్ర పుస్త‌కాలు చ‌ద‌వాలా? అంటూ విమ‌ర్శ‌లు చేశారు.

ఇక దేశాన్ని ఏకం చేసిన స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌తో విభ‌జ‌న వాదాలు క‌లిగిన జిన్నాను పోల్చి అఖిలేష్ వ్యాఖ్య‌లు చేయడం వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్య‌ల‌తో అఖిలేష్ విభ‌జ‌న మ‌న‌స్త‌త్వం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని యోగి విమ‌ర్శించారు. మ‌రోవైపు రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో తాను ఎక్క‌డి నుంచైనా పోటీ చేస్తాన‌న్న యోగి వ్యాఖ్య‌ల‌పై అఖిలేష్ స్పందించారు. ఓడిపోయేవాళ్లు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తే ఏం లాభం? అంటూ విమ‌ర్శించారు.

ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నని ప్ర‌క‌టించిన అఖిలేష్‌.. పార్టీ నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఎన్నిక‌ల‌ను వేడిని ఇప్ప‌టి నుంచే రాజేసిన అఖిలేష్.. జిన్నా గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎన్నిక‌లకు ముందు కావాల‌నే ఈ వివాదాన్ని అఖిలేష్ రాజేశార‌ని.. బీజేపీని ఇర‌కాటంలో పెట్టేందుకు ఇలా చేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఇత‌ర పార్టీల‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలో చేర‌డంతో ఎస్పీలో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. ఇదే జోరుతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా పార్టీ సాగ‌నుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.