రామేశ్వరం వెళ్లినా.. శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది.. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు.. ఈటల రాజేందర్ పరిస్థితి. గత మే నెలలో.. ఎలాంటి పరిస్థితి ఎదురైందో.. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయింది. తాజాగా.. ఈటలకు.. ఆయన ఆధ్వర్యంలోని జమున హ్యాచరీస్‌కు కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిజానికి గతంలోనే మెదక్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇవి చెల్లవంటూ.. తెలంగాణ హైకోర్టు చెప్పడంతో.. అప్పటి నుంచి మౌనంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయించింది. దీంతో కేసీఆర్.. ఈటలను వదిలి పెట్టరా? అనే టాక్ వినిపిస్తోంది.
తన కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కోసం మాజీమంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారని.. పేర్కొంటూ.. గతంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది.
అంతేకాదు.. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఈ కేసు విషయంలో.. కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ.. ఇటీవల హుజూరాబాద్ ఉప పోరులో ఈటల గెలుపు తర్వాత.. వెంటనే ఆయన తుట్టెను కదిపినట్టు భావిస్తున్నారు.
ముసాయిపేటలోని అసైన్డ్ భూములపై విచారణకు సీఎం కేసీఆర్ తాజాగా విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు ఈటల రాజేందర్‌కు నోటీసులు అందించారు. అయితే.. ఇది రాజకీయంగా మరోసారి వివాదం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉండడం. హుజూరాబాద్‌లో ఓడిపోవడం.. బీజేపీ దూకుడు పెరగడం.. వంటి కీలక పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం.. రాజకీయంగా మరింత సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.