ఆంధ్ర్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం తప్పట్లేదు. పాలన పరంగా ఎన్నో నిర్ణయాలు వివాదస్పదం అయ్యాయి. అసలే అప్పుల్లో మునిగిపోయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జగన్ సర్కారు.. కొన్ని ఒప్పందాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొలుపుతోంది.
ఒకప్పుడు మిగులు విద్యుత్‌తో గొప్ప స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు విద్యుత్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ప్రజలు విద్యుత్ కోతలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే కోతలు కూడా అమలువుతున్నాయి.
ఐతే కొరత తీర్చే దిశగా కొన్ని చర్యలు చేపడుతున్నారు కానీ.. అవే ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. గుజరాత్ వ్యాపారవేత్త అదానీకి ప్రయోజనం చేకూర్చేలా.. రాష్ట్రానికి వేల కోట్ల నష్టం తెచ్చేలా ఈ నిర్ణయాలు ఉంటుండటమే ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.
విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పెద్ద స్కాంకు తెరతీసిందని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణ చేశారు. అదానీ కంపెనీ దేశంలోనే అత్యధిక రేటుకు విద్యుత్ అమ్ముతున్న సంస్థల్లో ఒకటని.. అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దాని జోలికి వెళ్లడం లేదని.. కానీ జగన్ సర్కారు మాత్రం ఆ కంపెనీ మీద ప్రేమ చూపిస్తూ ఏకంగా యూనిట్ 4.5 రూపాయలు విద్యుత్ కొనబోతోందని ఆయన ఆరోపించారు.
పైకి మాత్రం 2.49 రూపాయలకే యూనిట్ కొంటున్నట్లు చెబుతున్నా.. గుజరాత్ నుంచి ఇక్కడికి విద్యుత్ రప్పించడానికి అయ్యే మొత్తం ఖర్చు యూనిట్‌కు రూ.4.5 దాకా ఉంటుందని.. అదానీ కంపెనీపై ఈ ప్రత్యేక ప్రేమకు కారణం చీకటి లావాదేవీలే అని ఆయన ఆరోపించారు. మరోవైపు అదానీకి చెందిన సంస్థ నుంచే జగన్ సర్కారు విద్యుదుత్పత్తి కోసం 5 లక్షల టన్నుల బొగ్గు కొనబోతోందని.. గతంలో టన్ను రేటు రూ.5 వేలని.. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం టన్నుకు రూ.19,500 చెల్లించబోతోందని.. ప్రస్తుత రేటుతో పోలిస్తే 7 వేలకు పైగా ఎక్కువ ధర ఇచ్చి జగన్ ప్రభుత్వం అదానీ కంపెనీ నుంచి బొగ్గు కొనబోతోందని.. ఇది కూడా పెద్ద స్కామ్ అని ఆరోపణలు వస్తున్నాయి. అదానీపై జగన్‌కున్న ప్రేమతో అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రం మీద విపరీతమైన భారం మోపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.