రంగంలోకి పెద్దిరెడ్డి.. ఇక బాబుకు కంగారే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల యుద్ధం మొద‌లైంది. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల‌తో పాటు వివిధ కారాణాల వ‌ల్ల కొన్ని చోట్ల నిలిచిపోయిన న‌గ‌ర పాలక సంస్థ‌లు ఎంపీటీసీ జెడ్పీటీసీ స‌ర్పంచ్ స్థానాల‌కు ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అందులో కుప్పంతో పాటు నెల్లురు మున్సిపాలిటీల‌కు జ‌రిగే ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తోంద‌న‌డంలో సందేహం లేదు. నామినేష‌న్ల ప్ర‌క్రియ‌తోనే రాజ‌కీయ వేడి ర‌గులుకుంది.

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇటీవ‌ల అక్క‌డ జ‌రిగిన పంచాయ‌తీ, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యాలు సాధించి సొంత‌గ‌డ్డ‌పై బాబును గ‌ట్టిదెబ్బ కొట్టింది. బాబుకు కంచుకోట అయిన కుప్పానికి బీట‌లు వారేలా చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీ జెండా ఎగ‌రేయ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఆ దిశ‌గా స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ టీడీపీకి వ‌రుస‌గా చెక్ పెడుతూ వైసీపీ విజ‌యాలు సాధిస్తోంది. అయితే ఈ విజ‌యాల వెన‌క వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కీల‌కంగా మారారు. వైసీపీ ఎన్నిక‌ల స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు కుప్పంలో అడుగుపెట్టారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఆధిప‌త్యానికి కార‌ణ‌మైన ఆయ‌న‌.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌.. ఇటీవ‌ల బద్వేలు ఉప ఎన్నిక ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఇలా ఎన్నిక ఏదైనా పార్టీ ఆయ‌న‌వైపే చూస్తుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కుప్పంలో టీడీపీని పూర్తిగా ఖాళీ చేయించేలా అడుగులు వేస్తున్న పెద్దిరెడ్డి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో పోటీప‌డే అభ్య‌ర్థుల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి మొత్తం ఆయ‌నే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటున్నారు. నామినేష‌న్ ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే కుప్పానికి వెళ్లిన పెద్దిరెడ్డి.. అక్క‌డ ఎన్నిక‌లో పోటీ చేస్తున్న 25 మంది వార్డు స‌భ్యులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై నేత‌ల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేశారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని ఓడిస్తే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే బాబుపై మాన‌సికంగా పైచేయి సాధించ‌వ‌చ్చ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో పెద్దిరెడ్డి ఉత్సాహం నింపిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ఈ ఎన్నిక‌ల‌ను బాబు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి వ‌రుస దెబ్బ‌లు తగులుతుండ‌డంతో దిద్దుబాటు చ‌ర్చ‌లు చేప‌ట్టిన ఆయ‌న‌.. ఇటీవ‌ల కుప్పంలో ప‌ర్య‌టించారు. అక్క‌డి పార్టీ క్యాడ‌ర్‌లో ఆత్మ‌విశ్వాసం నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని స్థానిక నాయ‌కుల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ నేప‌థ్యంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. మ‌రి ఇక్క‌డ టీడీపీ తిరిగి పుంజుకుంటుందా? లేదా వైసీపీ దూకుడు కొన‌సాగుతుందా? అన్న‌ది మ‌రికొన్ని రోజుల్లో తేలిపోనుంది.