రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీచేయాలని కాపుల్లోని ప్రముఖులు కొందరు పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనసేన ఒంటరిగా పోటీచేయటానికి కొన్ని కారణాలను సదరు ప్రముఖులు పవన్ కు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినపుడు మాత్రమే పార్టీ సత్తా ఏమిటో తెలుస్తుందని చెప్పారట. అలాగే పార్టీ ఓటుబ్యాంకును పెంచుకోవాలంటే ఒంటరి పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పారట.
సమాజంలోని వివిధ సామాజిక వర్గాలకు పవన్ ఆలోచనల ప్రకారం న్యాయం జరగాలంటే అది ఒంటరి పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయపడినట్లు సమాచారం. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటినుండే నియోజకవర్గాలపై అధ్యయనం చేయటం ద్వారా ఏ సామాజికవర్గాన్ని ఏ నియోజకవర్గంలో పోటీ చేయించాలనే విషయంలో ఒక నిర్ణయానికి రావటానికి వీలవుతుందని కాపు ప్రముఖులు పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాలు-సామాజికవర్గాల పోటీపై కసరత్తు వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయకపోతే తర్వాత ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. కమ్మ సామాజికవర్గం విషయంలో పవన్ సానుకూలత, టీడీపీలోని కొందరు సీనియర్ల ప్రకటన గమనిస్తే టీడీపీతో పొత్తుకు పవన్ అర్రులు చాస్తున్నారనే భావన జనాల్లో పెరుగుతున్నట్లు కూడా పవన్ తో కాపు ప్రముఖులు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రచారాలు పార్టీకి బాగా డ్యామేజి చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమన్నారట.
కమ్మవాళ్ళని ఏమన్నా అంటే తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయని పవన్ చెప్పిన మాటలతో కాపుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతున్నట్లు కూడా చెప్పారట. కాపులు మాత్రమే కాకుండా ఇతర సామాజికవర్గాలు కూడా జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలనే విషయాన్ని పవన్ ఇప్పటివరకు స్పష్టం చేయకపోవటం పెద్ద మైనస్ గా చెప్పారట. మొన్నటి ఎన్నికల్లోనే 38 నియోజకవర్గాల్లో టీడీపీ, 10 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపోటములను జనసేన ప్రభావితం చేసిన విషయాన్ని కాపు ప్రముఖులు పవన్ కు గుర్తుచేశారట.
ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు మద్దతిచ్చినంత మాత్రాన సరిపోదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని కాపులు లేదా బలిజలతో పాటు ఇతర కమ్యూనిటీస్ కూడా జనసేనకు ఓట్లేయాలంటే అందుకు తగ్గ యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పారట. పార్టీ సిద్ధాంతాలు, మ్యానిఫెస్టో తయారుచేసి జనాల్లోకి ఇప్పటి నుండే తీసుకెళ్ళాలని కూడా స్పష్టం చేశారట. హోలు మొత్తంమీద ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే జనసేన ఒంటరిపోరు చేయాలని చెప్పినట్లు అర్ధమవుతోంది. మరి పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి.