రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జానారెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ సింహావలోకనం చేసుకుంటోంది. ఈ రోజు గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం గరంగరంగా జరిగినట్లు చెబుతున్నారు. హుజురాబాద్ ఓటమిపై నేతలు తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే హుజురాబాద్ ఫలితాల తర్వాత ఓటమికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాడివేడిగా చర్చ సాగినట్లు చెబుతున్నారు.

రేవంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేత జానారెడ్డి తప్పుబట్టారు. జానారెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనను వారించేందుకు నేతలు ప్రయత్నం చేశారు. అయితే తాను చెప్పాల్సి విషయాలను చెప్పనిస్తారా లేకుంటే వెళ్లి పోమంటారా అని మండిపడ్డారు.

హుజురాబాద్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ తర్వాత రేవంత్ చేసిన వ్యాఖ్యలన్నింటినీ జానారెడ్డి దగ్గరగా పరిశీలించినట్లు చెబుతున్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్లు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారని జానారెడ్డి తెలిపారు. ఇంతమంది ప్రచారం చేసినా కూడా ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. కాబట్టి సమిష్టి నిర్ణయంగా చెప్పాలని, అలా కాకుండా రేవంత్ తానే బాధ్యత తీసుకుంటానని ఎలా చెబుతారని జానారెడ్డి ప్రశ్నించారు. ఒక్కరిదే బాధ్యత ఎలా అవుతుందని నిలదీశారు.

జానారెడ్డి వ్యాఖ్యలను మరోనేత రేణుకా చౌదరి సమర్ధించారు. ఓటమికి సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని జానారెడ్డి స్వరంలో గొంతు కలిపారు. ఈ సమావేశాన్ని జానారెడ్డి చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతి సారి సమావేశానికి రాలేనని, తన అవసరం ఉన్నప్పుడే మాత్రమే వస్తానని తెలిపారు.

సీనియర్ నేత వి. హనుమంతరావు, మధుయాష్కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజురాబాద్ లో ప్రచారం అట్టర్ ప్లాప్ అయిందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఓటమికి గల కారణాలను నేతలు అన్వేషించారు. ఓటమికి గల కారణాలను అధిష్టానానికి పంపాలను నేతలు నిర్ణయం తీసుకున్నారు.