హోరాహోరీ ప్రచారాలు.. మాటల యుద్ధాలు.. విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. డబ్బు ప్రవాహం.. ఇలా ఎంతో ఆసక్తిని రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ముగిసింది. దాదాపు మూడు నెలలకు పైగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఎన్నికలో ప్రజలు ఈటల రాజేందర్‌కే మరోసారి పట్టం కట్టారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం కోసం ఎంతగానో ప్రయత్నించినా అక్కడి ఓటర్లు ఈటలకే అండగా నిలిచారు. అక్కడి ప్రజల్లో ఒకడిగా ఉన్న ఈటలను ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇక ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్.. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌పై ఎలా యద్ధం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ పార్టీతోనే రాజకీయ కెరీర్‌ను కొనసాగించి ఉద్యమ నేత ప్రజల మనసులు గెలుచుకున్న ఈటల రాజేందర్.. నాలుగు నెలల వ్యవధిలోనే టీఆర్ఎస్ మంత్రి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మారిపోయారు.
భూ కబ్జా ఆరోపణలతో ఏ పార్టీ మంత్రివర్గం నుంచి అయితే బర్తరఫ్ అయి.. ఆ తర్వాత ఆ పార్టీకే గుడ్‌బై చెప్పారో.. ఇప్పుడా టీఆర్ఎస్కు సవాలుగా నిలిచేందుకు ఈటల సిద్ధమయ్యారు. ఉప ఎన్నికలో విజయం ద్వారానే టీఆర్ఎస్కు తన దెబ్బ రుచి చూపించిన ఈటల.. ఇక ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన పోరాడేందుకు సై అంటున్నారు.
ఈటల ముందుగా దళిత బంధుతోనే కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారం. తన కారణంగానే దళిత బంధు వచ్చిందని ఉప ఎన్నికలో ప్రచారం కొనసాగించి విజయవంతమైన ఈటల.. ఇప్పుడు అదే పథకం పేరుతో పోరు సాగించనున్నారు.
ఎన్నికలో విజయం తర్వాత తొలిసారి స్పందించిన ఆయన.. దళిత బంధుపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో అందరికీ దళిత అమలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదరికంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు దళిత బంధు తరహా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి లాంటి సమస్యలపై పోరాడేందుకు సిద్ధమవుతున్నాననే హింట్ ఇచ్చారు. ముఖ్యంగా దళిత బంధుపైనే ఈటల రాజేందర్ ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. హుజూరాబాద్‌లో విజయం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధుతో గెలుపు దక్కకపోగా.. ఇప్పుడు ఈటలకు అదే ప్రధానాస్త్రం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈటల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరికొంత మంది నాయకులు టీఆర్ఎస్ను వీడే ఆస్కారముందని నిపుణులు అంటున్నారు.