తనకు హుజురాబాద్ కంచుకోట అని బీజేపీ నేత ఈటల రాజేందర్ నిరూపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు అన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన ఈటల విజయం మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే ఖరారైంది.
మొత్తం 2,05, 536 ఓట్లు పోల్ కాగా, ఈటలకు 1,06,213, గెల్లు శ్రీనివాస్ కు 82,348, కాంగ్రెస్ కు 2767 ఓట్లు వచ్చాయి.
ఈటల గెలుపుతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 2023 ఎన్నికల్లోనూ తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల విజయం సాధించడం ఇది ఏడో సారి. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఈటల…మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి హుజురాబాద్ కా బాద్ షా గా నిలిచారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై చాలాకాలంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలోకి దిగారు.
ఇక, ఈటల ఓటమే టార్గెట్ గా కేసీఆర్ అండ్ కో పనిచేసింది. అయితే, హుజురాబాద్ లో పోరు హోరాహోరీగా ఉంటుందని, అతి స్వల్ప మెజారిటీకే చాన్స్ ఉందని, అది కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఈటల గెలుపు ఖాయమని, భారీ మెజారిటీ సాధిస్తారని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈటల 30వేల మెజారిటీతో గెలుస్తారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా షాకింగ్ ప్రకటననిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఈటల హుజురాబాద్ తన ఇలాకా అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.