షర్మిళ ‘కరోనా’ హామీ.. ఒక రేంజ్ ట్రోలింగ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిళ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టడం చాలామందికి విడ్డూరంగా అనిపించింది. తెలంగాణ కోడలినని ఎంత చెప్పుకున్నా ఆమెను ఇక్కడి జనాలు పెద్దగా ఓన్ చేసుకోలేదన్నది స్పష్టం.

తన అన్నయ్య జగన్ మీద కోపం ఉంటే, ఆయన మీద అలిగితే ఏపీలో ఆయనకు పోటీగా పార్టీ పెట్టాలి కానీ.. తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించడం ఏంటో జనాలకు అర్థం కావడం లేదు. దీని వెనుక రకరకాల థియరీలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా తన పార్టీ విషయంలో జనాల నుంచి ఏమంత సానుకూల స్పందన కనిపించకపోయినా.. షర్మిళ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇటీవలే పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణ అంతటా తిరిగేస్తోంది.

షర్మిళ ఏం చేసినా చాలా నాటకీయంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఏపీలో జగన్ చేసినట్లే చేస్తుండటం జనాలకు విచిత్రమైన భావనలు కలిగిస్తోంది. ఆ సంగతలా ఉంచితే షర్మిళ చేసే డిమాండ్లు, ఇచ్చే హామీలు కూడా అంతే నాటకీయంగా ఉంటున్నాయి. తాజాగా షర్మిళ ఇచ్చిన హామీ మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్ ట్రోలింగ్ జరుగుతోంది. తన పాదయాత్రకు వస్తున్న స్పందన గురించి.. ఆ సందర్భంగా జనాలు తన దగ్గర చెప్పుకున్న బాధల గురించి షర్మిళ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ ప్రజల కరోనా కష్టాల గురించి మాట్లాడింది.

కరోనా చికిత్స కోసం ప్రజలు భారీగా ఖర్చు చేశారని.. ఐతే కొవిడ్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి చేర్చలేదని.. తమ పార్టీ తరఫున ఎంత పోరాడినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఈ విషయంలో తానొక హామీ ఇస్తున్నానని.. రాష్ట్రంలో వైఎస్స్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే గత రెండేళ్లలో కరోనా కోసం ప్రజలు ఖర్చు పెట్టిన అన్ని బిల్స్ రీఎంబర్స్‌మెంట్ చేస్తామని.. అందుకోసం బిల్లులన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆమె సూచించడం గమనార్హం. తెలంగాణలో షర్మిళ పార్టీ అధికారంలోకి రావడమేంటి.. ఏళ్ల ముందు నాటి కరోనా బిల్స్ చెల్లించడమేంటి.. అందుకోసం బిల్స్ జాగ్రత్త చేసుకోవాలని సూచించడమేంటి అంటూ షర్మిళను నెటిజన్లు మీమ్స్ ద్వారా ట్రోల్ చేస్తున్నారు.