ఎంఎల్ఏలే సొంత సర్వేలు చేయించుకుంటున్నారా ?

ఇపుడిదే అంశంపై అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటనే విషయమై జనాల నాడి పసిగట్టేందుకు ఎంఎల్ఏల్లో చాలామంది సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం సుమారు 100 మంది ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారట. వీటిల్లో ఇఫ్పటికే 30 నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయి వివరాలన్నీ ఎంఎల్ఏల చేతికి అందినాయట.

ఈ నివేదికల ప్రకారం నియోజకవర్గాల్లో 40 శాతం జనాల్లో తమ పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు అర్ధమవుతోందట. 60 శాతం జనాల్లో ఎంఎల్ఏల పనితీరుపై సంతృప్తిగానే ఉన్నా 40 శాతం జనాలు అసంతృప్తితో ఉన్నారనే విషయమే టెన్షన్ పెట్టేస్తోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 40 శాతం జనాల్లో అసంతృప్తి ఉందంటే ఈ శాతం ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో జనాల్లో 50 శాతానికి పైగా జగన్మోహన్ రెడ్డి పాలనపై చాలా హ్యాపీగా ఉన్నట్లు సర్వేలో తేలిందట.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో సంతృప్తిగా ఉన్నట్లు జనాలు సర్వేలో చెప్పినట్లు సమాచారం. అంటే జగన్ పై మెజారిటీ జనాల్లో సంతృప్తి ఉన్నా కొందరు ఎంఎల్ఏల విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో జగన్ ఎంఎల్ఏ అభ్యర్థులను మార్చేస్తారనే ప్రచారం పార్టీలో ఊపందుకుంటోంది. మార్చబోయే ఎంఎల్ఏల అభ్యర్ధులు ఎవరు ? ఎన్ని నియోజకవర్గాల్లో కొత్త నేతలు పోటీచేస్తారనే విషయంలో క్లారిటి లేదు.

తనమీద సంతృప్తి, ఎంఎల్ఏల పనితీరుపై అసంతృప్తి ఉందనే విషయం స్పష్టమైతే అలాంటి నియోజకవర్గాల్లో కొత్తవారితో పోటీచేయించేందుకు జగన్ ఏ మాత్రం వెనకాడరు. మొదటి నుండి జగన్ వ్యవహారశైలి ఇలాగే ఉంటోంది. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న ఎంఎల్ఏలు, ఎంపీల విషయంలో జగన్ చాలా కఠినంగా ఉంటున్న విషయం తెలిసిందే. హద్దులు మీరి ఒకరిపై మరొకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుని పార్టీ, ప్రభుత్వ పరువును రోడ్డున పడేస్తున్న ఎంఎల్ఏలు, ఎంపీలను పిలిపించి గట్టిగా వార్నింగులు ఇచ్చారు. దాంతో నెల్లూరు, తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు మళ్ళీ నోరిప్పలేదు.

కాబట్టి పార్టీకి భారమనో లేకపోతే గెలుపు అవకాశాలు లేవనో తేలితే మాత్రం వాళ్ళకి టికెట్లలో కోత తప్పదనే భయం ప్రజాప్రతినిధుల్లో ఉంది. అందుకనే సొంతంగా ఎవరికి వారుగా సర్వేలు చేయించుకుంటున్నారట. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలుంది కాబట్టి ఈలోగా తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఎంఎల్ఏలకు అవకాశముంది. పూర్తిగా ప్రజాసమస్యల పరిష్కారం మీదే దృష్టి పెట్టడం, పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండటం, నియోజకవర్గాల్లో రెగ్యులర్ గా పర్యటనలు చేయటం అనే అంశాల మీద మాత్రమే దృష్టిపెడితే మళ్ళీ టికెట్లు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అంతే సంగతులు.