ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ఘన విజయంతో తొలిసారి అధికారాన్ని దక్కించుకున్న వైఎస్ జగన్‌కు ఇప్పుడు పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రజల ఆదరణతో తిరుగులేని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్.. ఆ తర్వాత తన సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు.
తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు తనవైపే ఉంటారనే విశ్వాసంతో జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమను మళ్లీ గెలిపిస్తారనే ఆయన ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని రెండు ఉద్యమాలు జగన్‌ను ఇరకాటంలో పెడుతున్నాయి. అందులో ఒకటి అమరావతి రైతులది కాగా మరొకటి విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి నిరసనగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అక్కడి ప్రజలు రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా వాళ్ల ఉద్యమం సాగుతోంది.
కాగా ఇప్పుడు రైతులు చేపట్టిన మహా పాదయాత్రతో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇప్పుడు తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ రైతులు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి మరీ వాళ్లు అనుమతి తెచ్చుకున్నారు. ఈ పాదయాత్రకు విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.
ఇక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పరిశ్రమ కార్మికుల నుంచి ఎన్ని రకాలుగా అభ్యంతరాలు వచ్చినా కేంద్ర సర్కారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో 200 రోజులకు పైగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది.
ఇప్పుడీ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జత కలవడంతో ఇది మరింత ఉద్ధృతంగా మారే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు ప్రకటించడ విశేషం.
ఈ ఉద్యమాల సెగ ఇప్పుడు జగన్‌కు గట్టిగానే తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రోజులుగా సాగుతున్న అమరావతి ఉద్యమానికి మీడియాలో పెద్దగా ప్రచారం రావట్లేదు. కానీ ఇప్పుడీ మహా పాదయాత్ర అన్ని వర్గాల దృష్టిని ఆకర్షించి మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యే ఆస్కారం ఉంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి పవన్ మద్దతుతో మరింద ఆదరణ దక్కే వీలుంది.
ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాల విషయంలో జగన్ సర్కారు ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. జగన్ మాత్రం మూడు రాజధానులపైనే పట్టు పట్టుకుని ఉన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం కేంద్రం నిర్ణయంపై జగన్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేంద్రంతో పోరుకు జగన్ సర్కారు మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates