ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ నాయకులందరూ ఇప్పుడు చర్చిస్తున్న విషయం ఏమన్నా ఉందా? అంటే.. అది మంత్రి వర్గ విస్తరణ మాత్రమే. 2019లో జగన్ అధికారం చేపట్టినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడా సమయం ఆసన్నం కావడంతో కొత్తగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో? ఉన్నవాళ్లలో ఎవరిని పక్కనపెడతారో? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఉన్న నారాణయస్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను జగన్ తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక మంత్రి బుగ్గనకు కొత్తగా వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టారు.
సంక్రాంతికి ముందు ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడీ పరిణామం ఆసక్తికరంగా మారింది. మంత్రిగా నారాయణస్వామి పనితీరు అంతంతమాత్రమేనన్న అభిప్రాయాలున్నాయి. ఆయనకు అప్పగించిన శాఖల్లో సరైన పనితీరు కనబర్చకపోవడంతోనే ఇప్పుడు జగన్ ఆయన శాఖను తప్పించినట్లు ప్రచారం సాగుతోంది.
చేజేతులారా నారాయణనే తన శాఖను కోల్పోయేలా చేసుకున్నారని అంటున్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణ స్వామికి కీలకమైన ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖలో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా చేశారు. ఆ జిల్లా నుంచి మంత్రి పదవుల కోసం బలమైన పోటీ ఉన్నప్పటికీ నారాయణనే జగన్ కేబినేట్లోకి తీసుకున్నారు.
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే రెండు కీలక శాఖల బాధ్యతలను నారాయణకు అప్పగించారు. కానీ మంత్రి అయినప్పటి నుంచి ఆయన తన శాఖల కంటే కూడా ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మద్యం బ్రాండ్ల విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు నారాయణ స్వామి సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.
మరోవైపు వాణిజ్య పన్నుల శాఖ నుంచి అనేక ఆరోపణలు సీఎంవోకు చేరాయంటున్నారు. అయినా మంత్రి దృష్టి పెట్టకపోవడంతో ఆ శాఖ తప్పించారని టాక్. ఇక ఇప్పుడు జగన్ చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఈ శాఖను ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates