దేశ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని పెత్తనం చలాయించి.. కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ప్రస్తుతం దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ ఒంటరిగా అధికారంలో ఉంది. మరోవైపు వరుసగా రెండు సార్లు కేంద్రంలో గద్దెనెక్కిన బీజేపీపై దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. దాన్ని క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ దిశగా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే తెలంగాణలోనూ కీలక మార్పులు చేసింది. అధిష్ఠానం ఆదేశాలతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సభలు సమావేశాలు ర్యాలీలతో ప్రజల్లోకి వెళ్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్న రేవంత్.. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. ఇలా పార్టీ కోసం ఓ వైపు రేవంత్ పాటుపడుతుంటే.. మరోవైపు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు మాత్రం రేవంత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడమే చాలా మంది సీనియర్ నాయకులకు నచ్చలేదు. అప్పటి నుంచి వాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం వచ్చినపుడు రేవంత్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రేవంత్‌తో కలిసి పార్టీ బలోపేతం కోసం సీనియర్లు పని చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినా ఎలాంటి మార్పు కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు రేవంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఏపీలోనూ పార్టీ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే అప్పుడు కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని అందుకు ఆయన సిద్ధమా? అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేవంత్.. కేసీఆర్ మళ్లీ ఉమ్మడి రాష్ట్ర కుట్రలకు తెరతీశారని మళ్లీ సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ తల్లికి బదులు తెలుగు తల్లి ఫోటోలను పెట్టడం ఏమిటనీ? వేలాది మంది ప్రాణా త్యాగలతో తెచ్చుకున్న తెలంగాణను ఏపీలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. కానీ తాజాగా జగ్గారెడ్డి మాత్రం సమైక్యవాదనికి తన మద్దతును ప్రకటించారు. గతంలోనూ తాను సమైక్య వాదాన్నే వినిపించానని, అది నా వ్యక్తిగత అభిప్రాయమని పార్టీకి సంబంధం లేదని చెప్పారు.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి అభిప్రాయం వేరని.. తన అభిప్రాయం వేరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల నినాదం నెరవేరడం లేదని ప్రజల ఆకాంక్షలు తీరడం లేదని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాలు కలుపుతానంటే కేసీఆర్‌కు మద్దతునిస్తానని ఆయన తెలిపారు. దీంతో మరోసారి కాంగ్రెస్‌లో సీనియర్ నేతల వైఖరి చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఏమో సమైక్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. పార్టీలోని మిగతా నాయకులు ఆ వ్యాఖ్యలను సమర్థించాల్సింది పోయి.. ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం ఏమిటో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు అయోమయంలో పడిపోయారు.