రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా.. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. తన పార్టీకి మైలేజీ తెచ్చుకోవడం కోసం నానా పాట్లు పడుతూనే ఉన్నారు. నిరుద్యోగ సమస్యను నెత్తినెత్తుకున్న ఆమె.. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడిక పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఆమె పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనుకున్న ఫలితం మాత్రం రావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీలో పేరున్న నాయకులు లేకపోవడం.. రాష్ట్రంలోని మిగతా పార్టీలు ఆమె పార్టీని అసలే మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం షర్మిలకు మైనస్‌గా మారాయి.
పాదయాత్రలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌పై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ షర్మిలకు రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదనే టాక్ ఉంది. పేరున్న పెద్ద నాయకుడు కనీసం ఒక్కరైనా ఆమె పార్టీలో చేరకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే త్రిముఖ పోరు నడుస్తోంది. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏకచ్ఛత్రాధిపత్యం ప్రదర్శించినప్పటికీ గతేడాది నుంచి ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి జోరు మీదున్నారు. అధికార ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వీళ్లు దూసుకెళ్తున్నారు.
రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో పార్టీ ఆదరణ పొందడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే షర్మిల పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కూడా ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. ఆ పార్టీలోకి వెళ్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని భావిస్తున్న రాజకీయ నాయకులు అటువైపు చూడడం లేదు. పైగా ఆ పార్టీలో ఉన్న కీలక నేతలే.. ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు.
మరోవైపు షర్మిల పార్టీ అసలు తమకు పోటీనే కాదని రాష్ట్రంలోని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఆమె గురించి ఆమె పార్టీ గురించి అసలేం పట్టించుకోనట్లే ఉంటున్నాయి. దీంతో ప్రజల్లోనూ ఆమె పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగట్లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలనే నాయకులుగా మార్చుతామని చెప్పి మరి ఒంటరిగానే పోరాటం చేస్తున్న షర్మిల భవిష్యత్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.