ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ ) తాజాగా సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పులో కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ… ఎల్జీ పాలిమర్స్ తన తప్పుకు పశ్చాత్తాపం చెందే స్థాయిలో ఎన్జీటీ తాజా తీర్పు ఉండటం విశేషం. ఇందులో సంచలన విషయం ఏంటంటే… ఇప్పటికే ఎన్జీటీ డిపాజిట్ చేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు ఉపయోగించాలని ఎన్జీటీ ఆదేశించింది.
గత మే నెలలో విశాఖపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీపాలిమర్స్ లో స్టైరీన్ గ్యాస్ లీకవడం వల్ల 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. దుర్ఘటన తీరు, అక్కడి పరిస్థితులు, దాని పర్యవసానాలు దేశాన్ని కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు, ఎన్జీటీ సుమోటోగా తీసుకుని విచారించాయి. తాజాగా ఈ కేసులో ఎన్జీటీ తన తొలి తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఒకరు, పీసీబీ నుంచి ఒకరు, విశాఖపట్నం కలెక్టరుతో కలిసి పర్యావరణ పునరుద్ధరణ కమిటీగా ఏర్పడి ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన 50 కోట్లతో పర్యావరణ పునరుద్ధరణ పనులు వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించింది. అది కూడా రెండు నెలల్లో చర్యలు చేపట్టి.. ఏమేం చేశారు అనేదానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ పర్యవేక్షణకు కేంద్ర పర్యావరణ శాఖను నోడల్ ఏజెన్సీగా పనిచేయమని ఆదేశించింది ఎన్జీటీ.
ఇక ముందు పూర్తి స్థాయి అనుమతులు దక్కకుండా, సకల నిబంధనలు పాటించినట్లు రుజువైతే తప్ప ఆ కంపెనీ తిరిగి ప్రారంభం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రధాన కార్యదర్శిదే అని చెప్పిన ఎన్జీటీ విశాఖ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణాల్లో ఒకటి అని పేర్కొంది. చట్టం ఉల్లంఘించి కంపెనీ నడిచేందుకు సహకరించిన అధికారిని గుర్తించి ఏపీ ప్రభుత్వప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని… ఏ చర్యలు తీసుకున్నదీ రెండు నెలల్లో మాకు నివేదిక పంపాలని ఆదేశించింది.
వీటితో పాటు మరో రెండు కమిటీలు వేయాలని ఎన్జీటీ చెప్పింది. ఒకటి బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం అంచనా వేయడానికి, మరోటి ప్లాంట్లో పర్యావరణ నిబంధనల తనిఖీకి నియమించాలని ఆదేశించింది. అసలు దేనికి కూడా ఎన్జీటీ రెండు నెలలకు మించి సమయం ఇవ్వలేదు. తన తీర్పుతో పర్యావరణం, ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా వ్యవహరించిన ఎల్జీ పాలిమర్స్ ను ఎన్జీటీ ఉక్కిరిబిక్కిరి చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates