బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హుజురాబాద్ ప్రజలకు ఆఫర్లు

హుజురాబాద్ ఉప ఎన్నిక మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. రైతులు, విద్యార్థులు, బాలికలు మహిళల సంక్షేమమే ధ్యేయంగా మెనిఫెస్టో రూపొందించారు. అన్ని రంగాలకు సుముచిత స్థానం కల్పించిన ఈ మోనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇందులో నియోజకవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్ అందజేస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం అందజేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.

అలాగే హుజురాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్స్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమున్నచోట ఆర్వోబీల నిర్మాణం చేపడుతామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

వాస్తావానికి బీజేపీ హుజురాబాద్ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించనవి. ఈ పనులన్నీ అమలు చేయాలంటే కేంద్రప్రభుత్వం సంకల్పిస్తే సాధ్యమవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి తాము తప్పకుండా అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు హామీ పడుతున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాషాయ పార్టీ నిర్ణయం తీసుకుంది.

హుజురాబాద్‌లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తొలి సారిగా 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపు అన్ని పార్టీల మైక్‌లు మూగబోనున్నాయి. రేపే చివరి రోజు కావడంతో మరే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం లేదు. ముందుగానే జాగ్రత్త పడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహం పన్నింది.