ఆ నేత‌లు యూట‌ర్న్‌!

2019 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం ఘోర ప‌రాజ‌యం చెంద‌గానే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికే రావాల‌నుకుంటున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌మ‌లాన్ని వ‌దిలి సైకిల్ ఎక్కాల‌నుకుంటున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. గ‌తంలో పార్టీ మారిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు సొంత ఇంటికి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వాళ్ల కోసం నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టికెట్లు కూడా రిజ‌ర్వ్ అయ్యాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత టీడీపీ నుంచి రాజ్య‌స‌భ ఎంపీలు వైఎస్ చౌద‌రీ, సీఎం ర‌మేశ్‌, గ‌రిక‌పాటి మోహ‌న్ రావు, టీజీ వెంక‌టేశ్ బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా క‌ప్పుకున్నారు. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు కూడా పార్టీ మార‌డం విశేషం. త‌మ రాజ‌కీయా ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవడంతో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెంత‌కు వీళ్లు చేరారు. మ‌రోవైపు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను చంద్ర‌బాబే కావాల‌నే పంపించార‌నే అభిప్రాయాలున్నాయి. బీజేపీతో నుంచి త‌న‌కో వాయిస్ ఉండేందుకు ఆయ‌న ఇలా చేశార‌ని అంటుంటారు.

కానీ ఇప్పుడీ నాయ‌కులంద‌రి చూపు మ‌ళ్లీ టీడీపీపై ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగి రెండున్న‌రేళ్లు కావొస్తుంది. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరిగి వీలైనంత త్వ‌ర‌గా టీడీపీలో చేరిపోయేందుకు బీజేపీ నాయ‌కులు ముహూర్తాలు చూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. వీరిలో ఇప్ప‌టికే కొంత మంది బాబుతో ట‌చ్‌లోనే ఉన్నారని తెలిసింది. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే చావు దెబ్బ తిన‌డం ఖాయం. ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో ఉన్న పొత్తు రేపోమాపో ముగిసేలా ఉంది. దీంతో ఇక పెట్టుకుంటే టీడీపీతోనే పొత్తు పెట్టుకోవాలి. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్‌ను ముందే గ్ర‌హించిన ఈ నాయ‌కులు సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు ఇలా పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన నాయ‌కుల‌కు వాళ్ల నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టీడీపీ నుంచి టికెట్లు కూడా రిజ‌ర్వ్ అయిన‌ట్లేన‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం వీళ్లు బీజేపీలో ఉన్నా.. మ‌రోవైపు ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీడీపీ ఇంచార్జ్‌ల‌ను నియ‌మించినా.. ఒక్క‌సారి వీళ్లు పార్టీలో చేర‌గానే ఆ టికెట్ల‌న్నీ వీళ్ల‌కే వ‌స్తాయ‌నే ఊహాగానాలు జోరంద‌కున్నాయి. రాజ్య‌స‌భ సభ్యులు కూడా త‌మ ప‌ద‌వీ కాలం పూర్తి కాగానే తిరిగి ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మయ్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నాయ‌కులను చూసుకుని బ‌లోపేతం అయిన‌ట్లు భావించిన బీజేపీ.. ఇప్పుడీ నేత‌లు వెళ్లిపోతే ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటుందో చూడాలి.