చిత్తూరు వైసీపీలో ముసలం వచ్చిందా? కీలక నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయా ? దీంతో పార్టీలో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పుంగనూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఓ రకంగా స్నేహితులు.. రాజకీయంగా చూస్తే.. అంతకుమించి.. అన్న రేంజ్‌లో నిన్న మొన్నటి వరకు రాజకీయాలు చేశారు. ముఖ్యంగా టీడీపీని సాధ్యమైనంత వరకు జిల్లాలో డైల్యూట్ చేసేందుకు ఇద్దరూ కలిసే ముందుకు సాగారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండాను ఎగరేసేందుకు ఇద్దరు నేతలూ.. కలసి కట్టుగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే కుప్పం మునిసిపాలిటీని.. ఏర్పాటు చేయడంలో అటు ఎంపీ.. రెడ్డప్ప, ఇటు మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే.. ఇటీవల ముగిసిన పరిషత్ ఎన్నికల తర్వాత.. నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కుప్పంలో ఎంపీ రెడ్డప్ప దూకుడు ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. తన పేరుతో ఉన్న ఫ్లెక్సీలనే ఆయన ఏర్పాటు చేయించారు.
అదే సమయంలో పెద్దిరెడ్డి వర్గం కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎంపీనే వాటిని తొలగించారని.. పెద్దిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య కూడా అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా మారాయి. ఒక్క కుప్పంలోనే కాకుండా.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇరువురు నేతల రాజకీయం ఇటీవల కాలంలో మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు కలిసి రాజకీయాలు చేసిన పెద్దిరెడ్డి, రెడ్డప్పలు.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని.. జోరుగా గుసగుస వినిపిస్తోంది. రెడ్డి వర్గాన్ని ప్రోత్సహించడం.. ఇష్టంలేకే.. రెడ్డప్ప దూరంగా ఉంటున్నారని .. ఓ వర్గం చెబుతోంది.
అయితే.. నియోజకవర్గంలో ఏం జరిగినా..రెడ్డప్ప దూకుడు ఎక్కువగా ఉందని.. మంత్రిగా పెద్దిరెడ్డికి ఇటీవల కాలంలో ఆయన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అధిష్టానం వద్ద తనకు రెడ్ కార్పెట్ ఉందని.. చెబుతున్నారని.. అందుకే.. ఈ నేతల మధ్య సైలెంట్ వార్ నడుస్తోందని చెబుతున్నారు. మొత్తానికి ఈ దుమారం ఎటు దారితీస్తుందోనని పార్టీనేతలు కలవరం చెందుతున్నారు. ఇక, టీడీపీ ఈ తరహా పరిణామాలనే ఆశించిన నేపథ్యంలో వైసీపీలో మరింత విభేదాలు వస్తే బాగుంటుందని.. కోరుకుంటుండడం గమనార్హం. ఇప్పుడిప్పుడే.. కుప్పంపై పట్టు సాధిస్తున్న సమయంలో వైసీపీలో అంతర్గత విభేదాలు.. పట్టుజార్చేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.