బాల‌య్య బాబు ఎక్కడ‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయ వాతావ‌ర‌ణం మంట పుట్టిస్తోంది. అధికార వైసీపీ.. ప్ర‌తిప‌క్ష టీడీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. హెచ్చ‌రిక‌లు.. దీక్ష‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కాయి. అటు వైసీపీ నుంచి నాయ‌కులంద‌రూ మూకుమ్మ‌డిగా టీడీపీపై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇటు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని టీడీపీ నేత‌లు కూడా దీటుగానే స‌మాధానమిస్తున్నారు. కానీ ఈ మాట‌ల పోరులో టీడీపీలో ముఖ్య నేత అయిన నంద‌మూరి బాల‌కృష్ణ క‌నిపించ‌డం లేదు. త‌న బావ చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల దీక్ష‌లోనూ ఆయ‌న లేరు. దీంతో బాల‌య్య బాబు ఎక్క‌డ‌? అంటూ సందేహాలు మొద‌ల‌య్యాయి.

ఏపీ ముఖ్య‌మంత్రిపై టీడీపీ నేత ప‌ట్టాభి నోటికి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశాయి. ఈ దాడుల‌ను ఆ పార్టీలోని నాయ‌కులంద‌రూ ఖండించారు. కానీ బాల‌య్య ఒక్క మాట కూడా ఎక్క‌డా మాట్లాడ‌లేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురంలోని ఆయ‌న కార్యాల‌యంపై దాడి జ‌రిగినా స్పందించ‌లేదు. ఆయ‌న ఏదో తీరిక లేకుండా ఉన్నార‌ని అనుకుందాం.. కానీ క‌నీసం బావ చేప‌ట్టిన దీక్ష‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోరా? అని సొంత పార్టీ వ‌ర్గాల నుంచి ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

బాల‌య్య బాబు ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చెప్పడం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాలున్నాయి. ఒక్కోసారి ఏపీ రాజ‌కీయాల గురించి.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల గురించి.. రాయ‌ల‌సీమ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తారు. ఆ త‌ర్వాత త‌న ఆసుప‌త్రి వ్య‌వ‌హారాలు చూసుకుంటారు. ఇంకొన్ని రోజులు సినిమాల షూటింగ్‌తో బిజీగా గ‌డిపేస్తారు. కానీ ఇప్పుడు ప్ర‌స్తుత ప‌ట్టాభి ఎపిసోడ్‌లో బాల‌య్య పాత్ర ఏ మాత్రం లేన‌ట్లే క‌నిపిస్తోంది. పార్టీ కార్యాల‌యాల‌పై దాడుల‌పై చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నాయ‌కులంతా స్పందించ‌గా.. బాల‌య్య మాత్రం మౌనంగానే ఉన్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏ మాత్రం స‌మంజ‌సం కాద‌ని టీడీపీ వ‌ర్గాలే అంటున్నాయి.

ఆహాలో ఓ టాక్ షో కోసం బాల‌కృష్ణ షూటింగ్ జోరుగా సాగుతుంద‌ని స‌మాచారం. దాని వ‌ల్లే ఆయ‌న బిజీగా ఉండి చంద్ర‌బాబు దీక్షా శిబిరానికి రాలేక‌పోయార‌ని తెలుస్తోంది. అయితే పార్టీ కార్యాల‌యాల‌పై దాడుల‌ను భారీ ఘ‌ట‌న‌గా మార్చేసి రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న తేవాల‌ని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడీ ఈ దాడుల‌ను ఆయుధంగా మ‌లుచుకునే అవ‌కాశం టీడీపీకి దొరికింది. ఈ దాడుల‌పై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లేందుక బాబు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య ఇలా సైలెంట్‌గా ఉండ‌డం స‌రికాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఆయ‌న ఆల‌స్యంగానైనా బ‌రిలో దిగి.. వైసీపీ నేత‌ల‌పై క‌న్నెర్ర చేస్తారా? అన్న‌ది చూడాలి.