తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల మీద కోపంతో రగిలిపోతున్నారా? తన సూచనలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? ఈ నాయకులను నమ్ముకుని లాభం లేదనుకునే స్వయంగా ఆయనే రంగంలోకి దిగారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ పార్టీ కార్యాలయాలపై పెద్ద యెత్తున వైసీపీ శ్రేణులు దాడులు చేసినా తమ నాయకుల్లో చైతన్యం రాకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా తాను పిలిపిచ్చిన బంద్‌లో టీడీపీ నాయకుల్లో చాలా మంది క్రియాశీలకంగా వ్యవహరించలేదని బాబు రగిలిపోతున్నారని సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడంతో పార్టీ శ్రేణుల్లో మార్పు వస్తుందని బాబు భావించారని అందుకే వారిలో ఉత్తేజాన్ని నింపడం కోసం ఆయన బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో బంద్ జరగలేదు. ఆ పార్టీ సీనియర్ నాయకులు కీలక నేతలు కార్యకర్తలు ఈ బంద్‌లో యాక్టివ్‌గా పాల్గొనలేదనే చెప్పాలి. ఒకరకంగా చూస్తే బంద్ విఫలమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ బంద్‌పై సాయంత్రం జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకున్న బాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బంద్ విషయంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారని తెలిసినా నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదని బాబు ప్రశ్నిస్తున్నారు.
పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగినా స్పందించని నేతలపై బాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే బయటకు రాకపోతే ఇంకెప్పుడు బయటకు వస్తారని కొంతమంది నేతలను బాబు సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. నాయకులే ముందుకు రాకపోతే ఇక కార్యకర్తలు ఎలా యాక్టివ్‌గా ఉంటారని బాబు క్లాస్ పీకినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే తాను ఒంటరిగానే 36 గంటలు దీక్ష చేయాలని బాబు నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయాలని బాబు పిలుపునిచ్చినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం ఫొటోలకే పరిమితమై గంటల వ్యవధిలోనే ఆ కార్యక్రమాలను ముగించారనే అభిప్రాయాలున్నాయి. అందుకే మరోసారి అలా జరగకూడదనే బాబు ఈ సారి తానే ఒంటరిగా దీక్షకు దిగాలని అనుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.