డీజీపీ నీ సంగ‌తి తేలుస్తా.. చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీ డీజీపీపై టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. నీలాంటి వాళ్ల‌ను ఎంతో మందిని చూశాన‌ని అన్న చంద్ర‌బాబు.. ఏం చేస్తావో.. చేసుకో.. అంటూ.. స‌వాల్ రువ్వారు. దేవాల‌యం వంటి పార్టీ ఆఫీస్‌పై దాడి జ‌రుగుతున్న‌ప్పుడు ఫోన్ చేస్తే.. స్పందించ‌ని డీజీపీ కూడా ఒక డీజీపీయేనా? అంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై.. వైసీపీ నాయ‌కులు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. గురువారం ఉద‌యం ఒకింత ఆల‌స్యంగా ప్రారంభ‌మైన ఈ దీక్ష‌కు పార్టీ నాయ‌కులు పోటెత్తారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై దాడి చేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదని.. కానీ ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకోలేకపోతే పోలీస్‌ వ్యవస్థను మూసేయాలని డీజీపీకి హితవు పలికారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబమని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌.. 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమన్న బాబు.. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినట్టు తెలిపారు.

స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంపై పోరాడాలనే దీక్ష చేస్తున్నానని చంద్ర‌బాబు తెలిపారు. మాస్కు అడిగాడని డాక్ట‌ర్ సుధాకర్‌ను పిచ్చోడిగా మార్చేశారు. రఘురామకృష్ణరాజును విచక్షణా రహితంగా కొట్టారు. డ్రగ్స్‌ ఇదేమాదిరిగా వస్తే జాతి నిర్వీర్యమవుతుంది. పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే మాపైనే కేసులు పెడతారా?. భావితరాల కోసం ఆలోచిస్తే డ్రగ్స్‌ను పూర్తిగా నివారించాలి అన్నారు. పదవుల కోసం ఆలోచించవద్దని పోలీసులు, వైసీపీ నాయకులను చంద్రబాబు కోరారు.

పిల్లల భవిష్యత్తు, సమాజం కోసం ఆలోచించాలని హితవు పలికారు. చట్టం కొంతమంది చుట్టం కావడానికి వీల్లేదని..ఇప్పటికైనా మారాలని వైసీపీ నాయకులను కోరారు. పార్టీ కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. ఎదురు కేసులు పెడతారా? అని నిలదీశారు. దాడిచేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీని ఏమనాలి? అని చంద్రబాబు ఆగ్రహం అన్నారు. మొత్తంగా దీక్ష ప్రారంభంలోనే చంద్ర‌బాబు ఫైర్ అవ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.