అరెస్టుకు ముందు వీడియో.. పట్టాభి తెలివే తెలివి

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్య‌క్తి.. తెలుగుదేశం నేత ప‌ట్టాభిరామ్. ఆంధ్రా ప్రాంతంలో గంజాయి స్మ‌గ్లింగ్‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు చేస్తూ ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేప‌డం.. ప్ర‌తిగా మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల వైసీపీ వ‌ర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల మీద‌.. అలాగే పట్టాభిరామ్ ఇంటి మీద తీవ్ర స్థాయిలో దాడికి పాల్ప‌డటం.. దీనిపై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రగ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌ట్టాభిరామ్‌పై వైసీపీ స‌ర్కారు కేసులు పెట్టింది. ఆయ‌న్ని బుధవారం అరెస్టు చేసింది.

ఐతే పోలీసుల అదుపులోకి వెళ్ల‌డానికి ముందు ప‌ట్టాభిరామ్ వ్యూహాత్మ‌కంగా రిలీజ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌తంలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశాక ఆయ‌న గాయాల పాలై క‌నిపించ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇదే త‌ర‌హాలో త‌న‌పై పోలీసులు దాడి జ‌రిపేందుకు ఆస్కారం ఉంద‌న్న అనుమానంతో ప‌ట్టాభిరామ్ ఈ వీడియో రిలీజ్ చేశారు. బుధ‌వారం నాటి ఈనాడు ప‌త్రిక‌ను చూపిస్తూ.. ఇది ఈ రోజు తీసిన వీడియో అని చెప్పుకొచ్చారు. త‌న ఒంటిపై ఎక్క‌డా గాయాలు లేవ‌ని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాన‌ని.. శ‌రీర భాగాల‌న్నింటినీ చూపించారు.

అరచేతులు.. పాదాలు.. పొట్ట.. వీపు.. ఇలా అన్ని భాగాలనూ ఆయన వీడియోలో చూపించడం గమనార్హం. రఘురామ కృష్ణంరాజు పాదాలు కందిపోయి కనిపిస్తే అది ఎడీమా అనే చర్మ సమస్య వల్ల తలెత్తిందని, పోలీసులు కొట్టడం వల్ల కాదని వాదించడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే పాదాలను చూపించి తనకు ఎడీమా లేదని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ముందే ఇలాంటి వీడియో రిలీజ్ చేయడంతో పట్టాభిరామ్ ఒంటిపై పోలీసులు ఒక్క దెబ్బ వేసినా చిక్కుల్లో పడ్డట్లే. పోలీసులను, వైకాపా ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా ముందే భలే ఇరికించారంటూ పట్టాభిరామ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.