తొందరలోనే ఏపీలో మినీ సమరానికి తెరలేవనున్నది. వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించటానికి స్టేట్ ఎలక్షన్ కమీషన్ రంగం సిద్ధం చేస్తున్నది. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సుమారు 12 మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. వార్డుల డివిజన్ సరిగాలేదని, రిజర్వేషన్లు సక్రమంగా కేటాయించలేదనే కారణాలతో ఎన్నికలు జరగలేదు.
కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ఓటర్ల జాబితా మీద కూడా వివాదాలు రేగటంతో ఎన్నికలు జరపలేదు. ఇపుడు అలాంటి వివాదాలన్నింటినీ అధికారులు సర్దుబాటు చేశారు. దాంతో అన్నీ రాజకీయపార్టీల ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకుని ఎన్నికల నిర్వహణకు డేట్ డిసైడ్ చేయటానికి కమిషన్ రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీన ముసాయిదా విడుదల చేయాలని కమిషన్ వివిధ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు రోజుల తర్వాత అంటే 23వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఎన్నికలు జరగబోయే వాటిల్లో నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు మరో 20 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.
తొందరలో జరగబోయే ఎన్నికలు తొమ్మిది జిల్లాల్లోని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలు, పశ్చిమగోదావరి, కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రాష్ట్రంలోని ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టే వీటిని మినీ సమరం అంటున్నది. మరి జనాల తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్న విషయం ఆసక్తిగా మారింది.