జ‌గ‌న్ కేబినెట్లో కొత్త హోం మంత్రి ఈమేనా ?

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాల‌తో పాటు అధికార వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జ‌గ‌న్ ఇస్తోన్న సంకేతాలే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా కనిపిస్తున్నాయి. కొద్ది నెల‌ల్లోనే ఏపీలో కేబినెట్ ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. ఈ సారి కూడా హోం మంత్రితో పాటు ఓ డిప్యూటీ సీఎం ఖ‌చ్చితంగా మ‌హిళ‌లే ఉండ‌బోతున్నార‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో హోం మంత్రిగా గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ వాణి ఉన్నారు. వీరిలో సుచ‌రిత ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాగా.. పుష్ప శ్రీ వాణి ఎస్టీ.

జ‌గ‌న్ కేబినెట్లో ప్ర‌స్తుతం ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరు ముగ్గురిని త‌ప్పించేస్తార‌నే అంటున్నారు. అయితే వీరి ప్లేసుల్లో ముగ్గురు మ‌హిళా ఎమ్మెల్యేలు కొత్త‌గా మంత్రులు అవుతారా ? లేదా ? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే. అయితే ఈ సారి మాత్రం శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, పాల‌కొండ ఎమ్మెల్యే క‌ళావ‌తి పేర్లు ప్ర‌ధానంగా రేసులో ఉన్నాయి. కీల‌క‌మైన హోం మంత్రి ప‌ద‌వి విష‌యంలో జ‌గ‌న్ రిస్క్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదంటున్నారు.

ఆ ప‌ద‌విని బ‌ల‌మైన వ్య‌క్తికి ఇస్తే లేనిపోని రిస్కులు చాలానే ఉంటాయి. అదే పెద్ద‌గా నోరు మెద‌ప‌ని వాళ్ల‌కు ఇస్తే.. పేరుకు మాత్ర‌మే వారు హోం మంత్రిగా ఉంటారు. తెర‌వెన‌క క‌థ అంతా ఏ స‌జ్జ‌లో న‌డిపించేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుచరిత విష‌యంలో అదే జ‌రిగింద‌ని అంటారు. అందుకే మ‌రోసారి ఏ రెడ్డి నేత‌ల‌కో లేదా బ‌ల‌మైన వాయిస్ ఉన్న వాళ్ల‌కో మంత్రి ప‌ద‌వి ఏ మాత్రం ఇవ్వ‌ర‌నే తెలుస్తోంది. ఇక ఈ సారి హోం మంత్రి రేసులో ప‌ద్మావ‌తి పేరు బ‌లంగా వినిపిస్తోంది.

ఎస్సీ మ‌హిళా ఎమ్మెల్యేల్లో సుచ‌రిత‌, తానేటి వ‌నిత ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్నారు. ఇక ప‌ద్మావ‌తి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి మాత్ర‌మే ఇప్పుడు మిగిలిన ఎస్సీ మ‌హిళా ఎమ్మెల్యేలు. వీరిలో ప‌ద్మావ‌తి సీనియ‌ర్‌. పైగా ఆమె భ‌ర్త సాంబ‌శివారెడ్డిది జ‌గ‌న్‌ది ఒకే సామాజిక వ‌ర్గం. ప‌ద్మావ‌తిపై జ‌గ‌న్‌కు ముందు నుంచే గురి ఉంది. ఆమె కూడా మంత్రి ప‌ద‌వి కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏదేమైనా చివ‌ర్లో ఈక్వేష‌న్లు ఏం మార‌క‌పోతే ఈ సారి కూడా హోం మంత్రి ప‌ద‌వి మ‌హిళ‌కే అని జ‌గ‌న్ డిసైడ్ చేసిన‌ట్టే తెలుస్తోంది.