బ్లేడన్న.. అలియాస్ బండ్లన్న.. ఏంటి గుర్తుకు రావట్లేదా.. ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కానీ టక్కున తోచట్లేదు కదూ.. అదేనండి.. అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తానని చెప్పారే.. ఆయనేనండోయ్.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. టాపిక్ ఏదైనా.. అది రాజకీయా..? సినిమానా..? అనేది పక్కనెడితే ఈయన వార్తల్లో నిలవాలవన్నదే ఆత్రం. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను.. అది కూడా ఆయన సపోర్ట్.. ఆయన ఆదేశాల మేరకు అడుగేస్తానంటున్నారు.. ఇంతకీ ఆ కథేంటి..? మళ్లీ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. రాజకీయాల్లో రీ ఎంట్రీపై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. రేవంత్ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని బండ్ల గణేష్ అన్నట్లు సమాచారం.
రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌కు కొత్త జోష్ వస్తోంది. కాంగ్రెస్‌కు వీడిన, పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను తిరిగి యాక్టివ్ చేసేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా నేతలను కలుస్తూ వారి టచ్‌లో ఉంటున్నారు. తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. కొందరు నేతలు అసంతృప్తులు వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు నేతలు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బుచ్చిగూడ గ్రామ మాజీ సర్పంచ్ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మల్లు రవి, బండ్ల గణేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, మల్లురవి, బండ్ల గణేష్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్నందున మీరు కూడా పార్టీలో యాక్టీవ్ రోల్‌గా ఉండాలని మల్లురవి, బండ్ల గణేష్‌కు సుచించారు. అందుకు గణేష్ సై అన్నట్లు తెలుస్తోంది. రేవంత్ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని బండ్ల గణేష్ అన్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన నిరాశ మిగిలింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడటంతో బండ్ల గణేష్ పార్టీ కార్యక్రమాలు, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తనకు అవకాశం కల్పించిన రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని సంచలన ప్రకటన చేశారు. అయితే బండ్ల గణేష్ కాంగ్రెస్‌లో తిరిగి చేరితే ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ రావడం ఖాయమని చెబుతున్నారు. ఈ సారి కూడా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ తర్వాత కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక పాత మార్గాన్నే ఎంచుకుంటారా అనే ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను తొలుస్తున్నాయి.