క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో రెండు ప్రధానమైన పార్టీల తరపున గట్టి అభ్యర్ధులే పోటీచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ తరపున మాత్రం చాలా మందికి తెలీని అభ్యర్థి పోటీచేస్తున్నారు. దీంతో ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే క్యాండిడేట్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికార టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.
గెల్లు గురించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా తెలీకపోయినా నియోజకవర్గంలో అయితే బాగానే పరిచయం ఉన్న వ్యక్తి. వ్యక్తిగతంగా గెల్లు ఎవరికి తెలుసు తెలీదు అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే అధికార పార్టీ తరపున పోటీచేస్తుండటమే గెల్లుకు కలిసొచ్చే అంశం. కాబట్టే గెల్లు గెలుపుకోసం కేసీయార్ మొదలు మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా పోలోమంటు నియోజకవర్గంలో ఎప్పటినుండో ప్రచారం చేస్తునే ఉన్నారు. కాబట్టి గెల్లు పరిచయం గురించి చింతే అవసరం లేదు.
ఇక ఈటల రాజేందర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మంత్రిగా ఉన్న ఈటలను బర్తరఫ్ చేయటం, తర్వాత ఎంఎల్ఏగా ఈటల రాజీనామా చేయటంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పటి నుండి ఈటలను ఎలాగైనా ఓడించాలన్న కసితో కేసీయార్ తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోయింది. కాబట్టి ఈటల గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరంలేదు. పైగా గడచిన ఆరు సార్లుగా వరుసగా ఇక్కడి నుండి గెలుస్తుండటం వల్ల చిన్నపిల్లాడిని అడిగినా ఈటల గురించి చెప్పేస్తారేమో.
చివరగా సమస్యంతా కాంగ్రెస్ అభ్యర్థి బెల్మూరి వెంకట్ గురించే. అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే వరకు వెంకట్ అంటే చాలామందికి తెలీదు. ప్రధాన పార్టీల తరపున గట్టి అభ్యర్ధులున్నారు కాబట్టే కాంగ్రెస్ తరపున కూడా గట్టి అభ్యర్థి అయితే బాగుంటుందని అనుకున్నారు. అందుకనే ఫైర్ బ్రాండ్ గా పాపులరైన కొండా సురేఖను అభ్యర్థిగా అనుకున్నారు. అయితే ఎందుకనో వర్కవుట్ కాకపోవటంతో వేరే దారి లేక చివరకు వెంకట్ ను ఎంపిక చేశారు. దాంతో ఇఫుడు భారమంతా రేవంత్ మీదే పడింది.
సురేఖ అయితే పార్టీకి ఊపు బాగుండేది. కానీ వెంకట్ అవటంతో ప్రచారంలో రేవంత్ అవస్తలు పడకతప్పటం లేదు. మల్కాజ్ గిరిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా రేవంత్ ఇంత కష్టపడలేదేమో అనిపిస్తోంది. గ్రామ గ్రామాన రేవంత్ తిరుగుతు మండలాల్లో బాధ్యతలు అప్పగించిన నేతలను సమన్వయం చేసుకోవాల్సొస్తోంది. ప్రతి మండలానికి నేతలను కేటాయించినా ఉదయం నుంచి రాత్రివరకు రేవంతే అన్నిచోట్లా తిరగాల్సొస్తోంది. దాంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంతే అన్నట్లుగా తయారైంది పరిస్ధితి.
Gulte Telugu Telugu Political and Movie News Updates