ఈ నష్టాన్ని బీజేపీ పూడ్చుకోవడం అసాధ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ఘటన వల్ల బీజేపీకి బాగా డ్యామేజి జరిగేట్లుంది. నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన జరిగిన డ్యామేజీని భర్తీ చేసుకోవటం సాధ్యమయ్యేది కాదు. నాలుగు రోజుల క్రితం లఖింపూర్ ఖేరిలో ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతుల మీదకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కొడుకు వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించటంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో 8 మంది చనిపోయారు.

రైతులపైకి దూసుకెళ్ళిన కారులో తన కొడుకు లేడని కేంద్రమంత్రి వాదిస్తున్నారు. కానీ అక్కడున్న వారంతా వాహనంలో కొడుకున్నాడంటున్నారు. ఇందులో నిజమెంతో బయటపడాల్సుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆశిష్ ను పోలీసులు అరెస్టు చేయకపోవటం పెద్ద సమస్యగా మారింది. ఒకవైపు ఆశిష్ అరెస్టు కోసం యూపీలోని ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమం హర్యానాకు కూడా పాకింది.

మరో ఐదు మాసాల్లో సాధారణ ఎన్నికలుండగా యూపీలో ఇలాంటి ఘటనలు జరగడం పార్టీకి తీరని నష్టం చేకూర్చేదనటంలో సందేహం లేదు. అందుకనే ఘటన జరగ్గానే మరణించిన వారందిరికీ తలా రు. 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది యోగి ప్రభుత్వం. అయినా రైతు సంఘాలు ఏ మాత్రం శాంతించటం లేదు. అసలే యూపిలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు తీవ్రంగా ఉద్యమం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రైతుల సమస్యను ఎలా అధిగమించాలో తెలీక బీజేపీ తలలు బద్దలు కొట్టుకుంటోంది.

ఇలాంటి సమయంలో హఠాత్తుగా మొదలైన వివాదంతో రాష్ట్రమంతా అట్టుడుకిపోతోంది. ఘటన జరిగిన దగ్గరనుండి కేంద్రమంత్రులు రాష్ట్రంలో ఒంటరిగా పర్యటించటం లేదట. రాష్ట్ర మంత్రులైతే అసలు అడ్రస్సే లేరట. మంత్రులే రైతులకు భయపడి అడ్రస్ లేకుండా పోతే ఇక స్థానిక ఎంఎల్ఏలు జనాలకు కనబడతారా ? ఇక్కడ సమస్యేమిటంటే ఖేరి లోక్ సభ ఎంపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ తండ్రి అజయ్ మిశ్రా కావటమే. స్వయంగా తమ ఎంపినే వివాదంలో ఇరుక్కోవటంతో ఆ ప్రాంతంలోని మంత్రులు, ఎంఎల్ఏలు ఎవరు జనాల్లో కనబడటం లేదట.

తాజాగా ఘటనపై సుమోటో గా సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. కోర్టు విచారణలో ఏ విషయాలు బయటపడతాయో ఎవరు చెప్పలేరు. అయితే ప్రజాకోర్టు మాత్రం బీజేపీ ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతిప్రతినిధులపై మండిపోతోందన్నది వాస్తవం. జరిగిన ఘటనను ప్రతిపక్షాలు కూడా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి. మొత్తానికి జరిగిన, జరుగతున్న డ్యామజీ నుండి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాల్సిందే.