ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న బద్వేలు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్. ఆ ఎన్నికలో పోటీ చేసేందుకు మరో పార్టీ సిద్ధమైంది. తమ అభ్యర్థిని పోటీకి నిలబెడతామని తాజాగా కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ కూడా అక్కడ పోటీ చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ సహా అక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో దిగుతుండడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ బీజేపీ సాధించేదేమీ ఉండదని ఎన్నిక ఏకగ్రీవం కాకుండా మాత్రమే అడ్డుకుంటున్నాని విశ్లేషకులు అంటున్నారు.
సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కానీ వైసీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధ బరిలో దిగుతుండడంతో రాజకీయ విలువలను పాటిస్తూ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించారు.
ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు తమ అభ్యర్థిని ఇంతకుముందే ప్రకటించినప్పటికీ టీడీపీ కూడా రేసు నుంచి తప్పుకుంది. కానీ అనూహ్యంగా జనసేన మిత్రపక్షమైన బీజేపీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించి చర్చకు తెరతీసింది. పైగా తమ అభ్యర్థి తరపున పవన్ ప్రచారం కూడా చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం మరీ విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా బద్వేలు ఉప ఎన్నికలో తమ పార్టీ బరిలో దిగుతుందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రకటించారు. దీంతో అక్కడ ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుందామనుకున్న వైసీపీకి ఈ రెండు పార్టీలు అడ్డుపడుతున్నాయి. అయితే ఈ పార్టీల తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములును రంగంలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో బాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జయరాముల వైపే బీజేపీ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ఈ సమయంలో ఈ ఉప ఎన్నికలో ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా? అన్నది అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీచేస్తారో చూడాలి.