ఆరు పోస్టులు.. కేసీఆర్‌కు.. అర‌వై స‌మ‌స్య‌లు!

రాజ‌కీయాల్లో నాయ‌కులు.. ప‌ద‌వులు ఆశించ‌డం సాధార‌ణ ప్ర‌క్రియే. రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు.. అంటే..ప‌ద‌వుల కోస‌మేన‌ని నాయ‌కులు కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతుంటారు. సో.. ఏ పార్టీలో ఉన్న నాయ‌కుల ల‌క్ష్య‌మైనా ఇదే. అయితే.. ఈ ప‌రిస్థితే ఆయా నేత‌ల విష‌యంలో పార్టీ అధినేత‌ల‌కు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మిస్తోంది. ఇప్పుడు ఇదే విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా.. తీవ్ర ఇర‌కాటంలో ప‌డ్డారు. తాజాగా రాష్ట్ర శాస‌న మండ‌లికి సంబంధించి.. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆరు స్థానాల‌కు ఏకంగా 60 మంది కీల‌క నేత‌లు పోటీ ప‌డుతున్నారు.

వీరంతా కూడా కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు.. మిత్రులు కూడా కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎవ‌రికి ఇవ్వాలి.. ? ఎవ‌రిని నియ‌మించాలి.. ? అనే విష‌యంలో కేసీఆర్‌కు పెద్ద ఎత్తున త‌ల‌నొప్పులు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌డియం శ్రీహ‌రి, గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, ఫరీదుద్దీన్, ఆకుల ల‌లిత‌, బోడ‌కుంటి వెంక‌టేశ్వర్లు, నేతి విద్యాసాగ‌ర్‌ల ప‌ద‌వీకాలం పూర్తవ‌డంతో ప్రస్తుతం మండ‌లిలో ఖాళీలు ఏర్పడ్డాయి. అసెంబ్లీలో ఉన్న బలాబలాల‌ను బ‌ట్టి ఆరింటికి ఆరు అధికార‌ టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. దీంతో నేత‌లు ఈ ప‌ద‌వులు ద‌క్కించుకునేందుకు తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో క‌డియం, గుత్తాలు.. మ‌రోసారి రెన్యువ‌ల్ చేయించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అధినేత క‌రుణిస్తే చాలు పెద్దలస‌భ‌లో అడుగు పెట్టొచ్చ‌ని మండ‌లి ఆశావ‌హులు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. అయితే.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, విధేయ‌త‌, జిల్లాల లెక్కలు వేసుకుని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. షెడ్యూల్ రాగానే పేర్లను అధికారికంగా ప్రక‌టిస్తార‌ని తెలుస్తోంది. అయినప్పటికీ ఆశావ‌హులు త‌మ ప్రయ‌త్నాలు తాము చేసుకుంటు ఉన్నారు. ఎక్కడ అవ‌కాశం దొరికినా నేత‌లు కంట‌ప‌డేందుకు ప్రయత్నిస్తున్నారు నాయకులు.

పార్టీ కోటాలో దేశ‌ప‌తి శ్రీనివాస్, రావుల శ్రవ‌ణ్ కుమార్ రెడ్డి, ఎల్పీ ఇంఛార్జ్‌ ర‌మేష్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎమ్మెల్సీలుగా అవకాశం వ‌స్తుంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి మాజీ స్పీక‌ర్ మ‌ధుసూదనాచారి, త‌క్కెళ్లప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, సీనియ‌ర్ నేత రాజ‌య్య యాద‌వ్ ఈసారి త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని లెక్కలు వేసుకుంటున్నారట. న‌ల్లగొండ జిల్లా నుంచి సాగ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీప‌డి త‌ప్పుకొన్న కోటిరెడ్డిని మండ‌లికి పంపుతాన‌ని సీఎం ఆనాడే ప్రకటించారు. అది ఇప్పుడేనా లేక భ‌విష్యత్తులోనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ఖ‌మ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తాతా మ‌ధు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్‌ ఇన్‌ఛార్జ్ శ్రీహ‌రిరావు, పాల‌మూరు జిల్లా నుంచి మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావులు సైతం ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. క‌డియం, గుత్తాలు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకుంటున్నారు. గుత్తా ఏకంగా.. మండ‌లిలోకి మ‌రోసారి అడుగు పెట్టి.. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆరు పోస్టుల‌కు దాదాపు 60 మంది పోటీ ప‌డుతుండ‌డం.. అంద‌రూ కావాల్సిన వారే కావ‌డం.. టీఆర్ఎస్ అధినేత‌కు తీవ్ర సంక‌టంగా ప‌రిణ‌మించింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.