కుల రాజకీయాలకు ‘కాపు’ కాస్తున్న పవన్ ?

ఏపీలో గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ జనసేన వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్ పై వైసీపీ మంత్రులు కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, గతానికి భిన్నంగా పవన్ కూడా ఈ సారి వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ మరింత పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇక, తాజాగా తూ.గో జిల్లాలో పర్యటించిన పవన్….ఏపీలో ఓ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేసుకొని కక్ష సాధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సమాజంలో ఒక కులాన్ని ద్వేషించడం, వర్గశత్రువుగా చేయడం సరికాదని, కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ వారు టార్గెట్ చేశారని పవన్ ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజలలు ముందుకు వస్తే తప్ప రాష్ట్రంలో మార్పు రాదని, 2009లో ఓ నాయకుడు వస్తే అతడిని పలుచన చేసి పంపించేశారని చిరంజీవిని ఉద్దేశించి పవన్ మాట్లాడడం చర్చనీయాంశమైంది. 2014 తర్వాత కాపు ఉద్యమాన్ని నీరుగార్చి ఉద్యమ నాయకుడిని అణచివేశారని పవన్ అన్నారు.

శెట్టిబలిజ సోదరులు, తూర్పు కాపులు, కొప్పుల వెలమ కులస్తులు బయటకు రాలేరని, దళితులకు సాధికారత జరగదని, మైనారిటీల అభివృద్ధి జరగదని పవన్ అన్నారు. మిగిలిన కులాల వారికి అండగా ఉంటూ ముందుకు పోవాలని పవన్ అన్నారు. దీంతో, కాపు సామాజిక వర్గంలో ఉన్న వారంతా ఒక్కతాటిపైకి వస్తేనే రాజ్యాధికారం సాధ్యమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

కుల,మత, ప్రాంతాలకు అతీతంగా తాను పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారని, అటువంటి పవన్…ఇపుడు తన సామాజిక వర్గాన్ని సంఘటితం చేసేందుకు పిలుపునివ్వడం ఏమిటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవిస్తానని చెప్పిన పవన్..కాపుల ఉద్యమం గురించి, చిరంజీవి ఓటమి గురించి మాట్లాడి కాపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడంపై కామెంట్లు వస్తున్నాయి.

ఇప్పటిదాకా వైసీపీ, టీడీపీలు కుల ప్రాతిపదికన రాజకీయాలు చేశాయని…అదే బాటలో పవన్ కూడా నడవబోతున్నారని అంటున్నారు. మెల్లగా పవన్ కూడా కుల రాజకీయాలకు ‘కాపు’ కాస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.