జబర్దస్త్ రోజా రాజకీయాలు.. వైసీపీని హీటెక్కిస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న రోజా.. సొంత పార్టీ నేతలపైనా.. వర్గంపైనా.. ఒంటికాలిపై దూకుడు ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు మరోసారి రోజాకు వ్యతిరేకంగా.. నాయకులు ధర్నాలకు దిగారు. ఇదంతా కూడా రోజా సొంత నియోజకవర్గం నగరిలోనే కావడం గమనార్హం. 2014, 2019 ఎన్నికల్లో నగరి నుంచి విజయం దక్కించుకున్న రోజా.. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తన హాట్ కామెంట్లతో రాజకీయాలను వేడెక్కించే నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
అయితే.. ప్రత్యర్థులపైనా.. ప్రతిపక్షాలపైనా చూపించాల్సిన దూకుడు.. సొంత పార్టీనేతలపై చూపించడమే ఇప్పుడు రోజాను కార్నర్ చేస్తోంది. తొలిసారి విజయం దక్కించుకున్నప్పుడు.. ఆమె దూకుడు కేవలం .. అప్పటి అధికార పార్టీ టీడీపీపైనే ఉండేది. అయితే.. రెండోసారి విజయంతో మాత్రం ఆమె సొంత పార్టీలో అందరూ తన మాటే వినాలి. నియోజకవర్గంలో ఏం జరిగినా.. పాజిటివ్‌గానే మాట్లాడాలి. తన విజయానికే అందరూ కృషి చేయాలి.. అనే ధోరణిని అవలంభిస్తున్నారు. తనపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా.. నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించినా.. సహనం కోల్పోతున్నారట.
దీంతో ఇప్పుడు రోజా విషయం.. నగరిలోనే కాకుండా.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయింది. కొన్నాళ్లుగా స్థానిక నేతలు రోజా పేరు ఎత్తగానే తలలు పట్టుకునే పరిస్థితి వస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన కేజే కుమార్ వర్గంతో వివాదానికి దిగిన రోజా.. జిల్లాకు చెందిన నారాయణ స్వామి సహా మంత్రులపైనా విమర్శలు చేశారు. అయినప్పటికీ.. రోజా వాదన ఫలించలేదు. కేజే కుటుంబానికి అధిష్టానం నుంచి మద్దతు పలికింది. కార్పొరేషన్ పదవిని కేజే కుమార్ సతీమణికి అప్పగించింది. దీంతో రోజా కొన్నాళ్లు అలిగినా.. మళ్లీ తన పంథాను తాను కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ తన దూకుడు తగ్గించుకోలేదు. శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్, పార్టీలో బలమైన వర్గ నేత.. చక్రపాణి రెడ్డి, ఆయన సోదరుడు భాస్కరరెడ్డితోనూ వివాదాలకు దిగుతున్నారు. నగరి నియోజకవర్గం పరిధిలోని నిండ్ర మండల పరిషత్ ఎన్నికల్లో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏడు స్థానాలు వైసీపీ, ఒక స్థానం టీడీపీ మద్దతు దారు దక్కించుకున్నారు. అయితే.. వైసీపీకి దక్కిన ఏడుగురులో ఇద్దరు రోజాకు అనుకూలంగా మారారు. మరో ఐదుగురు చక్రపాణి వర్గంగా ఉన్నారు. అయితే.. టీడీపీ అభ్యర్థిని తన వర్గంలో చేర్చుకున్న రోజా.. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలో రోజా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో వివాదం చెలరేగింది. తాము చెప్పినట్లే నడుచుకోవాలని రోజా అధికారులను బెదిరించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చక్రపాణి కూడా రోజాపై సీరియస్ అయ్యారు. దమ్ముంటే.. పార్టీకి రాజీనామా చేసి.. మా బలం లేకుండా.. మా మద్దతు లేకుండా .. ఇండిపెండెంట్‌గా గెలిచి చూపించాలని ఆయన సవాల్ రువ్వారు. ఇక, ఇక్కడ రోజా రగడతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఇక, ఈ వివాదం ఇప్పుడు తాడేపల్లికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా.. రోజా సొంత పార్టీ నేతలపైనే కస్సుబుస్సులాడడం విమర్శలకు తావిస్తోంది.