సీఎం జ‌గ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ టూర్ క్యాన్సిల్‌

ఏపీ ముఖ్య‌మంత్రి.. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శ‌నివారం త‌ల‌పెట్టిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ ఖ‌రారైంది. దీనిని మీడియాకు కూడా విడుద‌ల చేశారు.

అయితే.. అనూహ్యంగా ఆయ‌న శుక్ర‌వారం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. శుక్ర‌వారం ఉద‌యం రోజు వారీ వ్యాయామంలో భాగంగా.. జ‌గ‌న్ వ్యాయామానికి దిగారు. అయ‌తే.. ఆయ‌న కుడి పాదం అనూహ్యంగా మెలిదిర‌గ‌డంతో బెణికింది. దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. ఈ క్ర‌మంలో ప‌రీక్షించిన వైద్యులు.. కాలు బెణికింద‌ని.. పేర్కొంటూ.. క‌ట్టు క‌ట్టారు.

అయితే.. దీనిని సాధార‌ణ‌మే అనుకున్న సీఎం జ‌గ‌న్‌.. ఈ విష‌యాన్ని పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. అదేస‌మ‌యంలో రోజు వారి విధుల్లోనూ ఆయ‌న పాల్గొన్నారు. దీంతో కాలుపై మ‌రింత ఒత్తిడి పెరిగి.. సాయంత్రానికి వాచిపోయింది.

దీంతో ముఖ్య‌మంత్రి కి బెడ్ రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని.. వైద్యులు సూచించారు. ఫ‌లితంగా శ‌నివారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల్సిన ముఖ్య‌మంత్రి.. త‌న షెడ్యూల్ ను ర‌ద్దు చేసుకున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం పొద్దు పోయాక‌.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి మీడియాకు స‌మాచారం అందింది. వాస్త‌వానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్రాల‌తో ఈ నెల 26న‌ భేటీ కానున్నారు.

ఆయా రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి, న‌క్స‌ల్స్ ప్ర‌భావం ఎలా త‌గ్గించాల నే అంశంపై చ‌ర్చించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే న‌క్స‌ల్స్ ప్రభావిత రాష్ట్రాల‌కు .. కేంద్ర హోం శాఖ నుంచి ఆహ్వానాలు అందాయి. తెలంగాణ‌తోపాటు.. ఏపీకూడా న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్ర‌మే కావ‌డంతో.. కేంద్ర హోం శాఖ ఏపీ, ఒడిశా త‌దిత‌ర ప‌ది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానించింది.

ఈ క్ర‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆయ‌న ఢిల్లీలో నే ఉండాల‌ని షెడ్యూల్ నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఎలాగూ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఇప్ప‌టికే ఢిల్లీ ప‌య‌న‌మైన నేప‌థ్యంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అక్క‌డ‌.. చ‌ర్చించుకునే అవ‌కాశం ఉంద‌ని.. విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.అ యితే.. అనూహ్యంగా ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ ర‌ద్ద‌యింది.