తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని కుదిరితే.. ఆయన శుక్రవారమే (రేపే) ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కనున్నారని.. తెలంగాణ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వాస్తవానికి ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. సుమారు వారం రోజులకు పైగానే అక్కడ గడిపారు. ఈ నెల 1 ఢిల్లీ పయనమైన కేసీఆర్.. అక్కడ పార్టీ భవనానికి శంకు స్థాపన చేశారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత.. చాలా రోజులు అక్కడే ఉన్నారు. అప్పట్లో దీనిపై అనేక ఊహాగానాలు వచ్చాయి.
ఈ నెల 1న కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం అక్కడికి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే ఉండిపోయారు. 2 న టీఆర్ ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు సమావేశమైన కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు.
అదే సమయంలో యాదాద్రి గుట్టను సంపూర్ణంగా.. నూతనీకరించిన నేపథ్యంలో ఈ ఆలయ ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. అనంతరం అమిత్ షాను కలిశారు. కేంద్ర జలశక్తి మంత్రిని కూడా కలిశారు. తర్వాత.. చాలా రోజులు అక్కడే ఉన్నారు. ఇక, ఇప్పుడు పట్టుమని రెండు వారాలు కూడా తిరక్కుండానే.. మరోసారి కేసీఆర్ .. ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం ఆసక్తిగా మారింది. ఈ నెల 25న కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది.
ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని.. తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. అయితే.. ఇదొక్కటే కాదని.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చుకునేందుకు వెళ్తున్నారని.. మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు కేసీఆర్ టూర్ ఆసక్తిగా మారింది.