టీడీపీ కీలక నేతలు.. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చ న్నాయుడు.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. కొన్నాళ్ల కిందట..(సభలో కాదు) స్పీకర్ తమ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఓ లేఖ రూపంలో ఆయన రాశారు. అయితే.. దీనిపై ఆయన ఎందుకో సంతకం చేయలేదు. కానీ, మీడియాలో వచ్చేసింది. అయితే.. ఈ లేఖపై సీతారాం.. అసెంబ్లీ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు సార్లు విచారణ చేసిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి.. అచ్చెన్నపై చర్యలకు సిపారసు చేశారు.
అదేసమయంలో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఇది సభలోనే జరిగింది. పింఛన్లు పెంచుతూ.. పోతామన్నా.. కానీ.. కట్ చేస్తు న్నారని.. ఇదేనా సంక్షేమ పాలన అని విరుచుకుపడ్డారు. దీంతో ఈయనపై కూడా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈయనపై కూడా విచారణ జరిపిన కాకాని నేతృత్వంలోని కమిటీ.. తాజాగా సిఫారసు చేసింది. ఈ ఇద్దరినీ.. త్వరలోనే ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో వీరిద్దరికీ.. మైక్ ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది సభాపతి సీతారాం పేషీకి చేరింది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకుంటే.. ఇద్దరు కీలక నేతలకు వాయిస్ కట్ అవుతుంది.
అయితే.. ఈ విషయం ఇప్పుడు మరోసారి జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. సీఎంగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో జరిగిన తొలి సభలో.. జగన్ ఆవేశంగా ప్రసంగించారు. గత స్పీకర్(అప్పటికి జీవించే ఉన్నారు) కోడెల శివప్రసాద్ పేరు చెప్పకుండానే నిప్పులు చెరిగారు. “అధ్యక్షా.. సభలో సభ్యులకు స్వేచ్ఛ ఉండాలి. మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మా సభ్యురాలు.. రోజా.. ఏదో అన్నారని ఏకంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఇదేం అన్యాయం అధ్యక్షా! సభలో ప్రసంగించేప్పుడు.. సభ్యులకు స్వేచ్ఛ లేకపోతే.. ప్రజాస్వామ్యం ఎక్కడుంది అధ్యక్షా!!” అని ప్రశ్నించారు.
అంతేకాదు.. “మన సభలో(వైసీపీ సర్కారు హయాంలో) ఇలాంటి జరగకూడదు అధ్యక్షా! సస్పెండ్‌ల వరకు సభ పోకూడదు అధ్యక్షా! ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. విమర్శలు ఏ రూపంలో ఉన్నా.. మేం స్వీకరిస్తాం. మేమేమీ.. భుజాలు తడుముకోం. చంద్రబాబు మాదిరిగా బితుకు బితుకు మంటూ.. సభను నిర్వహించం. ఎవరు ఏం చెప్పినా..పాజిటివ్‌గానే తీసుకుంటాం. ఈ సభ దేశానికే ఆదర్శంగా ఉండేలా చూస్తాం” అని నీతులు చెప్పారు. అయితే.. ఇప్పుడు కేవలం రెండేళ్లు తిరిగే సరికి నాలిక రివర్స్ అయిందని అంటున్నారు పరిశీలకులు. గతంలో చెప్పిన నీతులు ఇప్పుడు జగన్ కానీ.. స్పీకర్ కానీ.. మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. సో.. ఈ పరిణామాలను బట్టి.. అచ్చెన్న.. నిమ్మలపై వేటు వేస్తే.. అది అంతిమంగా.. జగనకు మైనస్ అవుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.