కుప్పంపై కాన్ఫిడెన్సా..? మైండ్ గేమా? వైసీపీ వ్యూహ‌మేంటి…?


టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు టార్గెట్ చేశారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. మూకుమ్మ‌డిగా.. మంత్రులు.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని మీడియాలోకి లాగారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును కుప్పంలో ఓడిస్తామ‌ని.. ఒక‌రంటే.. మేం ఓడించేదేంటి.. కుప్పం ప్ర‌జ‌లే ఆయ‌న‌ను ఓడిస్తారంటూ వ్యాఖ్యానించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో ప్రారంభ‌మైన ఈ కుప్పం.. వ్యూహం.. పేర్ని నాని, చిత్తూరుకు చెందిన డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి, కొడాలి నాని వ‌ర‌కు కొన‌సాగింది.

ఈ మంత్రులు అంద‌రూ కూడా.. చంద్ర‌బాబును ఓడిస్తామంటూ.. ప్ర‌తిజ్ఞ‌లు చేశారు. ఏకంగా కొడాలి నాని.. కుప్పంలో చంద్ర‌బాబు గెలిస్తే.. తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని.. ప్ర‌తిజ్ఞ చేశారు. అయితే.. ఇది పిల్లి ప్ర‌తిజ్ఞొ.. నిజం ప్ర‌తిజ్ఞో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతానికైతే.. సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సో.. దీనిని బ‌ట్టి అధికార పార్టీ వైసీపీ కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటోంద‌ని.. చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌నే ఒక ప్ర‌చారం అయితే.. జోరుగా తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి చంద్ర‌బాబు హ‌యాంలోనూ కొంద‌రు నాయ‌కులు పులివెందుల‌లో జ‌గ‌న్‌ను ఓడించ‌డ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని చెప్పారు. స్థానిక ఎన్నిక‌ల‌లో వైఎస్ వివేకా ఓడిపోయిన‌ప్పుడు నెక్ట్స్ టార్గెట్ పులివెందులే అని చెప్పారు.

అలా.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ మంత్రులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలను చూసే వారు ఇలా కామెంట్లు చేస్తున్నారా? లేక‌.. దీనివెనుక వ్యూహ‌మేదైనా.. ఉందా? అంటే.. వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా.. చంద్ర‌బాబుకు ఒచ్చే ఎన్నిక‌లు.. కీల‌కంగా మార‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న లాస్ట్ ఛాన్స్ పేరుతో ఎన్నిక‌ల‌కు వెళ్లే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. సో… ఆయ‌న‌కు సింప‌తీ పెరుగుతుంద‌ని ఇప్ప‌టికే అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కుప్పంలో ఆయ‌న‌కు మరింత ప్ర‌భావం పెరుగుతుంది.

దీనిని ముందుగానే ప‌సిగ‌ట్టిన వైసీపీ మంత్రిగ‌ణం.. ఇప్ప‌టి నుంచే కుప్పం ప్ర‌జ‌ల‌ను.. టీడీపీ శ్రేణులను ఒక విధ‌మైన మాన‌సిక స్థితిలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది.. ప‌రిశీల‌కుల భావ‌న‌. ఇక్క‌డ కుప్పంలో వైసీపీ గెలిచినంత మాత్రాన‌ అసెంబ్లీ స్థాయికి వ‌చ్చే స‌రికి.. వైసీపీ గెలుస్తుంద‌నే న‌మ్మ‌కం త‌క్కువే. సో.. ఇప్పుడు మంత్రులు చేసిన వ్యాఖ్య‌లు.. కేవ‌లం మైండ్ గేమ్‌లో భాగ‌మేన‌ని.. టీడీపీలో నైరాశ్యం సృష్టించి.. పార్ట‌లో దూకుడును కంట్రోల్ చేయ‌డం ద్వారా.. మ‌రింత‌గా పార్టీని ఇరుకున పెట్టాల‌నే వ్యూహం ఉంద‌ని అంటున్నారు.