కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావాలో రేవంత్‌కు కోటి జ‌రిమానా!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, యువ నేత‌, ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి హైద‌రాబాద్ సిటీ కోర్టు భారీగానే షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల కాలంలో అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌పై ఆయ‌న దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రేవంత్‌.. సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు.. మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల రేవంత్‌.. డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్‌పై మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా డ్ర‌గ్స్ వాడుతున్నార‌నే కోణంలో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “కేటీఆర్ గోవా వెళ్లారు. నాలుగు నెల‌ల కింద‌ట ఆయ‌న గోవాకు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది. అక్క‌డ ఏం చేశారో చెప్పండి” అంటూ.. రేవంత్ స‌వాల్ విసిరారు.

ఒక‌వైపు రాష్ట్రంలో డ్ర‌గ్స్ కేసును ఈడీ విచారిస్తున్న స‌మ‌యంలో.. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌ను వ‌రుస పెట్టి విచారిస్తున్న స‌మ‌యంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్య‌లు సంచల‌నం రేపాయి. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా అంతే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. తాను ఏ ప‌రీక్ష‌కైనా సిద్ధ‌మ‌ని.. త‌న త‌ల వెంట్రుక‌లు, గోళ్లు, ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్ష కోసం స్వ‌చ్ఛందం గా ఇస్తాన‌ని అన్నారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ జాతీయ నాయ‌కుడు.. రాహుల్ గాంధీ కూడా ప‌రీక్ష‌ల‌కు సిద్ధం కావాల‌ని స‌వాల్ రువ్వారు. ఈ వివాదం కొన్నాళ్లుగా జ‌రుగుతుండ‌గానే.. రేవంత్ మ‌ళ్లీ ఫైర్ అయ్యారు.

కేటీఆర్‌కు డ్ర‌గ్స్‌తో సంబంధాలు ఉండ‌బ‌ట్టే.. అప్ప‌ట్లో ఐపీఎస్ అధికారి అకున్ స‌భ‌ర్వాల్ చేస్తున్న విచార‌ణ‌ను మ‌ధ్య‌లోనే ఆపేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు జ‌రుగుతున్న ఈడీ విచార‌ణ కూడా తాను కోర్టుకు వెళ్ల‌బ‌ట్టే జ‌రుగుతోంద‌ని అన్నారు. ఈ ప‌రిణామంపై కేటీఆర్ మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. డ్ర‌గ్స్‌తో త‌న‌పేరును ముడిపెట్ట‌డాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్నాన‌ని.. ప‌రువున‌ష్టం దావా వేస్తున్నాన‌ని.. ఆయ‌న రెండు రోజుల కింద‌ట ట్వీట్ చేశారు. అయితే.. ఇదంతా రాజ‌కీయంలో భాగ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఎందుకంటే.. నాయ‌కులు కాబ‌ట్టి.. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకోవ‌డం.. స‌వాళ్లు రువ్వుకోవ‌డం స‌హ‌జ‌మేన‌ని అనుకున్నారు. కానీ, కేటీఆర్ అన్నంత ప‌నీ చేశారు. త‌న పేరును డ్ర‌గ్స్ ఉచ్చులోకి లాగారంటూ.. రేవంత్‌పై ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన సిటీ సివిల్ కోర్టు.. రేవంత్‌కు గ‌ట్టి షాకే ఇచ్చింది. కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనిలో కేటీఆర్‌కు.. రేవంత్ రూ. కోటి ఇవ్వాల‌ని ఆదేశించింది. అదేవిధంగా ఇక‌పై కేటీఆర్ పేరును డ్ర‌గ్స్ వివాదంలో ప్ర‌స్తావించ‌రాద‌ని.. అదేవిధంగా ఈడీ విచార‌ణ‌లోనూ ఆయ‌న పేరును తీసుకురాకూడ‌ద‌ని.. ఆదేశించింది. విచార‌ణ‌ను వాయిదా వేసింది. మ‌రి దీనిపై రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.